పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్ కతా హైకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది. త్వరలో ఆ రాష్ట్రంలో జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు.. అభ్యర్థికి బెయిల్ మంజూరు చేసింది. నందిగ్రామ్ నియోజకవర్గానికి అక్టోబర్ 6వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలోనే.. నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మిలన్ ప్రధాన్ పోటీ చేస్తున్నారు. ఆయన ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు.. ప్రచారం చేసుకునేందుకు అవకాశం కోరుతూ బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. విచారణ చేసిన కోల్ కతా హైకోర్టు.. అక్టోబర్ 21వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇస్తూ ఆర్డర్స్ ఇచ్చింది. దీంతో ఆయన జైలు నుంచి కాకుండా బయట ఉండే ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. 2007 నందిగ్రామ్ అల్లర్లకు సంబంధించిన కేసులో ఈ కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసుతోపాటు మరికొన్ని కేసుల్లో ఆయన కొంత కాలంగా జైలులో ఉన్నారు.
రూ. 20,000 పూచీకత్తుపై ఈ బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ తీర్థంకర్ ఘోష్ తీర్పునిచ్చారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాతే ప్రధాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఆయనపై ఉన్న కేసులు 2007 నందిగ్రామ్ ఆందోళనలకు సంబంధించినవని కోర్టు స్పష్టం చేసింది. మిలన్ ప్రధాన్ నామినేషన్ పత్రాలు సమర్పించిన సమయంలో కస్టడీలో లేరని, ఆ తర్వాతే ఆయన అరెస్టు జరిగిందని కోర్టు పేర్కొంది.
2007 సంఘటనల తర్వాత ప్రధాన్ ఎలాంటి నేరాల్లోనూ భాగస్వామి కాలేదని, ప్రభుత్వం అందుకు సంబంధించిన ఎలాంటి సాక్ష్యాధారాలు చూపించలేకపోయిందని కోర్టు తెలిపింది. ఈ కేసులకు కారణమైన ఘటనలపై ఇప్పటికే సిబిఐ (CBI) దర్యాప్తు చేసిందని, ప్రధాన్ ఒక రాజకీయ కార్యకర్తగా ఆందోళనల్లో పాల్గొన్నారని తెలిపింది.
నందిగ్రామ్‌లో అక్టోబర్ 6న ఉప ఎన్నిక జరగనుండగా, అక్టోబర్ 4తో ప్రచారం ముగియనుంది. సెప్టెంబర్ 19న 2007 పాత కేసును చూపుతూ పోలీసులు అరెస్టు చేయడంపై జస్టిస్ సౌగత భట్టాచార్య కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రధాన్ కేసులో ఎలాంటి ప్రొడక్షన్ వారెంట్ చూపించకపోవడంతో అక్టోబర్ 12 వరకు ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకూడదని పోలీసులను ఆదేశించారు.
దీంతో కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్ జైలు నుంచి బయటకు వచ్చి నందిగ్రామ్ ఉప ఎన్నికల్లో నేరుగా ప్రచారం చేసుకునేందుకు లైన్ క్లియర్ అయ్యింది.
