జై శ్రీరాం అనే మోడీ.. హరహర మహదేవ్‌ అని ఎందుకు అనరు: సీఎం రేవంత్

జై శ్రీరాం అనే మోడీ.. హరహర మహదేవ్‌ అని ఎందుకు అనరు: సీఎం రేవంత్

హైదరాబాద్: శివుడు పేదోళ్ల దేవుడు.. శ్రీరాముడు ఉన్నోళ్ల దేవుడని సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జైశ్రీరాం అనే మాత్రమే మోడీ హరహర మహదేవ్ అని ఎందుకు అనరని ప్రశ్నించారు. దక్షిణాది వాళ్లంతా ద్రవిడులు.. ఉత్తరాది వాళ్లు ఆర్యులని అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ సోమవారం (సెప్టెంబర్ 28) అసోం దినపత్రిక ప్రతిదిన్ కాంక్లేవ్‎లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఆయన మాట్లాడారు.

 ‘‘2006లో ఇండిపెండెంట్‎గా పోటీ చేసి జెడ్పీటీసీగా గెలిచా. పోరాడాలంటే ప్రతిపక్షమే మేలని టీడీపీలో చేరా. 2009, 14లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచా. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో టీడీపీ ప్రాధాన్యం తగ్గింది. అందుకే కాంగ్రెస్‎లో చేరాలని నిర్ణయించుకుని 2017లో కాంగ్రెస్‎లో జాయిన్ అయ్యా. 2019లో కాంగ్రెస్ తరుఫున ఎంపీగా గెలిచా. ఐదేళ్లకే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‎, పీసీసీ చీఫ్‎గా పని చేశా. ఆ తర్వాత సీఎం అయ్యా. 

నేను కాంగ్రెస్‎లో చేరినప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నాయి. రెండింటితోనూ పోరాడాల్సిన పరిస్థితి ఉండేది. 2014 తర్వాత తెలంగాణలో పోటీ కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ తనను అనేకసార్లు జైలుకు పంపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాను అసెంబ్లీకి వెళ్లినదాని కన్నా జైలుకే ఎక్కువ సార్లు వెళ్లా. 

►ALSO READ | దానం మాజీ ఎమ్మెల్యే: ఖైరతాబాద్ ఖాళీ అయినట్లు అసెంబ్లీ ప్రకటన

టీడీపీకి రాజీనామా తర్వాత బీజేపీ, బీఆర్ఎస్‎లో చేరాలని చాలా మంది ఒత్తిడి చేశారు. బీజేపీలో చేరితో తెలంగాణలో ప్రభుత్వం వస్తుందని చెప్పారు. బీఆర్ఎస్‎లో చేరితో మంత్రి పదవి ఆఫర్ చేశారు. అయినా కాంగ్రెస్ పార్టీలోనే చేరాలని నిర్ణయించుకున్నా. తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందన్న దశలో పార్టీలో చేరా. కాంగ్రెస్ వల్లనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కల సాకారం అయ్యింది. 

ఏపీలో నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్రం ఇచ్చారు. కానీ బీఆర్ఎస్ హయాంలో సోనియా ఆశయాలను కేసీఆర్ తుంగలో తొక్కారు. చివరకు కేసీఆర్ దొరల పాలనకు చరమగీతం పాడి తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. తెలంగాణలో బీజేపీకి పెద్దగా ప్రాధాన్యం లేదు’’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.