దానం మాజీ ఎమ్మెల్యే: ఖైరతాబాద్ ఖాళీ అయినట్లు అసెంబ్లీ ప్రకటన

దానం మాజీ ఎమ్మెల్యే: ఖైరతాబాద్ ఖాళీ అయినట్లు అసెంబ్లీ ప్రకటన

హైదరాబాద్: దానం నాగేందర్ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అయ్యారు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత.. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయినట్లు ప్రకటించింది అసెంబ్లీ. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా చూపిస్తూ గెజిట్ విడుదల చేశారు అసెంబ్లీ కార్యదర్శి. 2024, ఏప్రిల్ 23వ తేదీ నుంచి ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉన్నట్లు చూపిస్తూ గెజిట్ విడుదల అయ్యింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది మాత్రం 2026. సెప్టెంబర్ 18వ తేదీన.

ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు అసెంబ్లీ స్పీకర్ ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి సోమవారం (సెప్టెంబర్ 28) గెజిట్ విడుదల చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 2024, ఏప్రిల్ 23వ తేదీ నుంచి ఖైరతాబాద్‌ అసెంబ్లీ సీటు ఖాళీ అయినట్లు గెజిట్‌‎లో పేర్కొన్నారు. ఖైరతాబాద్ అసెంబ్లీ సీటు ఖాళీ అయినట్లు స్పీకర్ నోటీఫై చేయడంతో త్వరలోనే ఈసీ ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించనుంది. దానం నాగేందర్ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అయ్యారు. 

దానంపై అనర్హత వేటు:

పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్, బీజేపీ అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశాయి. అయితే, దానం నాగేందర్‎ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే గుర్తిస్తూ బీజేపీ, బీఆర్ఎస్ ఫిర్యాదులను స్పీకర్ తిరస్కరించారు. స్పీకర్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. 

ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు దానం నాగేందర్‎పై అనర్హత వేటు వేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఆయనపై అనర్హత పిటిషన్లను తిరస్కరిస్తూ అసెంబ్లీ స్పీకర్ వెలువరించిన తీర్పును కొట్టివేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(2), పదో షెడ్యూల్లోని 2(1)(ఎ) ప్రకారం.. దానం నాగేందర్ 2024 ఏప్రిల్ 23 నుంచే శాసనసభ సభ్యుడిగా అనర్హుడని ప్రకటించింది.

అదే తేదీన దానం నాగేందర్ కాంగ్రెస్ బీఫారం తీసుకుని సికింద్రాబాద్ పార్లమెంటు సీటుకు నామినేషన్ వేశారని, బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయడం ద్వారా బీఆర్ఎస్ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టేనని స్పష్టం చేసింది.

దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్టు ప్రకటించింది. స్పీకర్ కార్యదర్శికి, కేంద్ర ఎన్నికల సంఘానికి తీర్పు ప్రతులను పంపించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ తో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం తీర్పు వెలువరించింది.

 అయితే, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టులో కూడా దానంకు చుక్కెదురైంది. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ దానం నాగేందర్‎పై సుప్రీం కోర్టు అనర్హత వేటు వేసింది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ అసెంబ్లీ సీటు ఖాళీ అయినట్లు స్పీకర్ నోటీఫై చేశారు.