క్రికెట్ అభిమానులకు బిగ్ న్యూస్.. అక్టోబర్ 1న వన్డే వరల్డ్ కప్ 2027 షెడ్యూల్ విడుదల

క్రికెట్ అభిమానులకు బిగ్ న్యూస్.. అక్టోబర్ 1న వన్డే వరల్డ్ కప్ 2027 షెడ్యూల్ విడుదల

* అక్టోబర్ 1న కేప్ టౌన్‌లో 2027 వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్‌ రిలీజ్
* ఐసీసీ ర్యాంకింగ్స్ ద్వారా నేరుగా అర్హత సాధించిన 10 జట్లు
* ఆతిథ్య దేశాల హోదాలో దక్షిణాఫ్రికా, జింబాబ్వేలకు నేరుగా అర్హత
* మిగిలిన 4 స్థానాలను క్వాలిఫయర్లతో సెలక్ట్, సెమీ-ఫైనల్స్‌కు ముందు 3 దశల్లో టోర్నీ

ODI World Cup 2027 Schedule: 2027 వన్డే ప్రపంచ కప్‌కు కౌంట్‌డౌన్ గురువారం (అక్టోబర్ 1, 2026) అధికారికంగా ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ వేదికగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC), క్రికెట్ సౌత్ ఆఫ్రికా (CSA) సంయుక్తంగా ఈ టోర్నీ పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయనున్నాయి. టోర్నీ ప్రారంభానికి సరిగ్గా ఏడాది సమయం ఉన్నందున, అభిమానులు తమ ఆసక్తిని నమోదు చేసుకునేందుకు వీలుగా టికెట్ బ్యాలెట్ రిజిస్ట్రేషన్‌ను కూడా ఈ సందర్భంగా ప్రారంభించనున్నారు.

టోర్నీ తేదీలు, ఆతిథ్య దేశాలు: 

క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, 2027 వన్డే ప్రపంచ కప్ అక్టోబర్ 2న (గాంధీ జయంతి రోజున) ప్రారంభమై, నవంబర్ 21వ తేదీన ముగుస్తుంది. ఈ మెగా టోర్నీకి దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

అర్హత సాధించిన జట్లు ఇవే: 

* ఈ టోర్నీలో మొత్తం 14 జట్లు పాల్గొననుండగా, సెప్టెంబర్ 30 కటాఫ్ తేదీ నాటికి 10 జట్ల బెర్త్‌లు ఖరారు కానున్నాయి. ఆతిథ్య దేశాల హోదాలో దక్షిణాఫ్రికా, జింబాబ్వేలకు నేరుగా అర్హత లభించగా.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ద్వారా మరో 8 జట్లు ప్రపంచకప్‌లో అడుగు పెట్టనున్నాయి.

* ర్యాంకింగ్స్ ఆధారంగా భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు అర్హత సాధించే రేసులో ఉన్నాయి.

* ఆతిథ్య దేశమైన దక్షిణాఫ్రికా ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్నందున, తొమ్మిదో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్‌కు కూడా ఆటోమేటిక్‌గా ప్రపంచ కప్ ఆడే అవకాశం దక్కింది.

* మిగిలిన 4 స్థానాల కోసం వచ్చే ఏడాది ప్రారంభంలో క్వాలిఫయర్స్ జరగనున్నాయి. ప్రస్తుతం భారత్‌లో వన్డే సిరీస్ ఆడుతున్న వెస్టిండీస్, అలాగే ఆతిథ్య దేశాల్లో ఒకటైన నమీబియా కూడా ఈ క్వాలిఫయర్స్ ద్వారానే ప్రపంచకప్‌కు అర్హత సాధించాల్సిన పరిస్థితి నెలకొంది. 

సరికొత్త ఫార్మాట్.. సెమీస్‌కు ముందు 3 దశలు: 

* సూపర్ సిరీస్: అర్హత సాధించిన మొత్తం 14 జట్లలో చివరి ర్యాంకుల్లో ఉన్న మూడు జట్ల మధ్య ముందుగా ఈ సిరీస్ జరుగుతుంది. ఇందులో అగ్రస్థానంలో నిలిచిన ఒక జట్టు తదుపరి దశకు చేరుకుంటుంది.

* రౌండ్ 2: ఇందులో మొత్తం 12 జట్లను రెండు గ్రూపులుగా (గ్రూప్‌కు 6 జట్లు చొప్పున) విభజిస్తారు.

* సూపర్ 7 దశ: గ్రూప్ దశల నుంచి ముందంజ వేసిన జట్లు సూపర్ 7 దశలో తలపడతాయి.

* సెమీస్, ఫైనల్: సూపర్ 7 పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు సెమీ-ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ఆయా మ్యాచ్‌లలో గెలిచిన విజేతల మధ్య ఫైనల్ పోరు జరుగుతుంది.