- ములుగు జిల్లాలో 49 అడుగులకు, భద్రాచలం వద్ద 42 అడుగులకు చేరిన నీటిమట్టం
వెంకటాపురం/భద్రాచలం, వెలుగు : గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో ఇంద్రావతి నదికి భారీగా వరద రావడంతో గోదావరి నది నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద ఆదివారం ఉదయం ఐదు గంటలకు నీటిమట్టం 52 అడుగులుగా నమోదు కాగా.. సాయంత్రం ఐదు గంటలకు 49 అడుగులకు తగ్గింది.
వాజేడు మండలం చీకుపల్లి గ్రామ శివారులో కొత్తగా కడుతున్న బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు నీటిలో మునిగిపోవడంతో తెలంగాణ =- ఛత్తీస్‌గఢ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 25 గ్రామాలకు రాకపోకలు ఆగిపోవడంతో ప్రజలు నాటు పడవల్లో ప్రయాణిస్తున్నారు. అలాగే వెంకటాపురం మండలంలోని బెస్తగూడెం, పాత్రపురం, వీరభద్రవరం, అంకన్నగూడెం, ఆలుబాక గ్రామాలకు చెందిన రైతులు నాటు పడవలపై గోదావరి దాటి లంక పొలాలకు వెళ్తున్నారు.
భద్రాచలం వద్ద 42 అడుగులకు...
భద్రాచలం, వెలుగు : భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు 42.80 అడుగులుగా నమోదు కాగా.. నదిలో 9,22,872 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. వాగు ఒడ్డు ప్రాంతాల్లో సాగు చేసిన మిర్చి, పత్తి చేన్లను వరద చుట్టు ముట్టింది. మరో ఐదు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్లో కంట్రోల్‌రూం ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 08744 241950 నంబర్ కు ఫోన్ చేయాలని కలెక్టర్ సూచించారు.
