జయశంకర్ భూపాలపల్లి: బట్టీ చదువులకు స్వస్తి..విద్యార్థుల్లో సృజనాత్మకతకు ‘అభ్యాస దీపికలు’

జయశంకర్ భూపాలపల్లి: బట్టీ చదువులకు స్వస్తి..విద్యార్థుల్లో సృజనాత్మకతకు ‘అభ్యాస దీపికలు’
  •     విద్యార్థులకు వర్క్ బుక్స్ అందిస్తున్న ప్రభుత్వం
  •     శాస్ర్తీయ దృక్పథాన్ని పెంపొందించేలా ప్రణాళిక

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ‘అభ్యాస దీపికలు’ చదువును ఆసక్తికరంగా మార్చడంతోపాటు విద్యార్థుల్లో సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు దోహదపడుతున్నాయి. పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను స్వయంగా సాధన చేసుకునేలా రూపొందించిన ఈ వర్క్‌‌బుక్స్‌‌ విద్యారంగంలో నూతన ఒరవడికి నాంది పలుకుతున్నాయి. 

సొంతంగా ఆలోచించి రాసేలా..

గ్రామీణ ప్రాంతాల్లో కొందరు విద్యార్థులు చదువుపై భయం, ఒత్తిడికి లోనవుతూ మధ్యలోనే చదువులకు దూరమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. బట్టీ చదువులకు స్వస్తి పలికి విద్యార్థులు సొంతంగా ఆలోచించి, అర్థం చేసుకుని, రాసేలా చేయడంతోపాటు విద్యా నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అభ్యాస దీపికలను అందిస్తోంది. ఈ అభ్యాస దీపికల ద్వారా చదువుపై విద్యార్థుల్లో ఉండే భయాన్ని, ఒత్తిడిని తగ్గించి స్వయంగా నేర్చుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. జయశంకర్‌‌ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కేజీబీవీల్లోని 18,344 మంది విద్యార్థులకు 29,144 అభ్యాస దీపికలను పంపిణీ చేశారు. పాఠ్య పుస్తకాల్లోని అధ్యాయాలను అధ్యయనం చేసిన అనంతరం విద్యార్థులు వాటిని సులభంగా అర్థం చేసుకుని సాధన చేసే విధంగా ఈ వర్క్‌‌బుక్స్‌‌ను రూపొందించారు. తెలుగు, ఇంగ్లిష్‌‌, హిందీ, సైన్స్‌‌, సోషల్‌‌, గణితం సబ్జెక్టులకు సంబంధించిన వర్క్‌‌బుక్స్‌‌ను విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా సంభాషణాత్మక విధానంలో రూపొందించారు. ఈ వినూత్న విధానం భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తుందని పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.

రంగుల చిత్రాలతో..
పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకునేలా రంగుల చిత్రాలు, ఆలోచింపజేసే ప్రశ్నలు, విభిన్న అభ్యాస కార్యక్రమాలతో అభ్యాస దీపికలను రూపొందించారు. దీంతో విద్యార్థులు వీటిపై ఆసక్తి చూపుతున్నారు. ఇంటి వద్ద సైతం స్వయంగా సాధన చేసుకునేందుకు, జ్ఞాపకశక్తిని పెంపొందించుకునేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా జీవశాస్త్రంలోని శరీర నిర్మాణాలు, ప్రకృతికి సంబంధించిన అంశాలను దృశ్యరూపంలో సులభంగా అవగతం చేసుకునేందుకు అభ్యాస దీపికలు ఎంతో ఉపకరిస్తున్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడంతోపాటు స్వయంగా ఆలోచించి నేర్చుకునేలా ప్రభుత్వం అభ్యాస దీపికలను అందించడంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.