- ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవ సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
- విద్యారంగంలో కాషాయీకరణను చొప్పిస్తోందని ఫైర్
హనుమకొండ, వెలుగు: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. శాస్త్రీయ విద్యను అందించకుండా, విద్యారంగంలో కాషాయీకరణను చొప్పిస్తూ స్టూడెంట్లలో మతోన్మాదాన్ని పెంచుతోందని మండిపడ్డారు. విద్యా కాషాయీకరణకు వ్యతిరేకంగా స్టూడెంట్లు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) 90వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన సభకు ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. అంతకుముందు వేలాది మంది స్టూడెంట్లతో హనుమకొండ పబ్లిక్ గార్డెన్ నుంచి కేయూ ఆడిటోరియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ దేశంలో ఏ విద్యార్థి సంఘానికీ 90 ఏండ్ల చరిత్ర లేదన్నారు.
భగత్ సింగ్ వారసత్వంతో స్వాతంత్ర్య ఉద్యమంలో పురుడు పోసుకొని దేశ స్వాతంత్ర్యం, దేశ భద్రత, శాస్త్రీయ విద్యే లక్ష్యంగా.. ‘చదువుతూ పోరాడు.. చదువు కోసం పోరాడు’ అనే నినాదంతో ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించిందని తెలిపారు. ప్రస్తుతం విద్యారంగం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోందని, విద్యార్థి లోకాన్ని నిర్వీర్యం చేసేలా పాలకుల విధానాలు కొనసాగుతున్నాయని చెప్పారు.
ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేశ్ సిరంగి రాజన్ మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో పాలకుల విధానాలను మార్చే శక్తి విద్యార్థులకే ఉందన్నారు. భగత్ సింగ్ వారసులైన విద్యార్థుల శక్తి జెన్ జీ ఉద్యమంగా మారిందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విద్యార్థుల హక్కులను కాలరాస్తోందని, ఎన్నికల కమిషన్ ను ప్రయోగించి విద్యార్థి, యువజనుల ఓటు హక్కును దోచుకుంటోందని విమర్శించారు.
ఏఐఎస్ఎఫ్, సీపీఐ నేతలు తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు, కర్రె భిక్షపతి, పల్లె నర్సింహ, కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్టా లక్ష్మణ్, రహమాన్, ఉట్కూరి ప్రణీత్ గౌడ్, భాషబోయిన సంతోష్, దిడ్డి పార్థసారథి, ల్యాదెళ్ల శరత్ పాల్గొన్నారు.
