ఖమ్మంను టూరిజం హబ్గా తీర్చిదిద్దాలి : కలెక్టర్‌‌‌‌ దివాకర

ఖమ్మంను టూరిజం హబ్గా తీర్చిదిద్దాలి : కలెక్టర్‌‌‌‌ దివాకర

మధిర, వెలుగు: జిల్లాలోని సహజసిద్ధమైన నీటి వనరులు, చెరువులు, సరస్సులను పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసి, ఖమ్మంను ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్‌‌‌‌ దివాకర ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం బోనకల్‌‌‌‌, మధిర మండలాల్లో పర్యటించిన కలెక్టర్‌‌‌‌ కలకోట పెద్దచెరువు, మడుపల్లి, మధిర ట్యాంక్‌‌‌‌బండ్‌‌‌‌, రివర్‌‌‌‌ఫ్రంట్‌‌‌‌ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, లోపాలను సహించేది లేదని స్పష్టం చేశారు. 

మధిర ట్యాంక్‌‌‌‌బండ్‌‌‌‌లో కాటేజీలు, రిసెప్షన్‌‌‌‌, కిచెన్‌‌‌‌-రెస్టారెంట్‌‌‌‌, పార్కింగ్‌‌‌‌, టాయిలెట్‌‌‌‌ తదితర సదుపాయాల పనులను వేగవంతం చేయాలని సూచించారు. కలకోట పెద్దచెరువు వద్ద మూడు కాటేజీలు, రిసెప్షన్‌‌‌‌, కేఫెటీరియా, పార్కింగ్‌‌‌‌ తదితర సదుపాయాలతో సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పర్యాటక అభివృద్ధితో స్థానికులకు ఉపాధి, చిన్న వ్యాపారాలకు అవకాశాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో రహదారులు, విద్యుత్‌‌‌‌, తాగునీరు, పారిశుధ్యం, భద్రత వంటి మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌‌‌‌ సూచించారు.