Jr NTR: ఎన్టీఆర్ ఎంట్రీతో దద్దరిల్లిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఈవెంట్.. తారక్ స్పీచ్‌లో హైలైట్స్ ఇవే

Jr NTR: ఎన్టీఆర్ ఎంట్రీతో దద్దరిల్లిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఈవెంట్.. తారక్ స్పీచ్‌లో హైలైట్స్ ఇవే

డ్రాగన్ సినిమా షూటింగ్‌లో గాయపడిన తర్వాత.. చాలా రోజుల విరామంతో మ్యాన్ ఆఫ్ మాసెస్ Jr ఎన్టీఆర్ మరోసారి పబ్లిక్ ఈవెంట్‌లో సందడి చేశారు. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన తారక్.. తన స్పీచ్‌తో అభిమానుల్లో కొత్త జోష్ నింపారు. చాలా రోజుల తర్వాత స్టేజ్‌పై ఎన్టీఆర్‌ను చూసిన అభిమానులు ఆయన మాటలు, ఎనర్జీకి ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియోలు, తారక్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ గురించి ఎన్టీఆర్ ఎంతో ఆసక్తిగా మాట్లాడారు. ఫహాద్ ఫాజిల్ లాంటి విలక్షణమైన నటుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోగా రావడం ప్రత్యేకమైన విషయమని పేర్కొంటూ.. ఆయన నటనపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన నటుడు ఫహాద్ ఫాజిల్ సినిమా కోసం తారక్ స్వయంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు రావడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఇప్పటికే ఫహాద్ నటన, శశాంక్ యేలేటి టేకింగ్‌పై అంచనాలు ఉండగా.. ఇప్పుడు ఎన్టీఆర్ మాటలు కూడా సినిమాకు అదనపు బజ్ తీసుకొచ్చాయి.

ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘‘అందరికీ నమస్కారం.. చేతికి సర్జరీ అయిన తర్వాత కొంతకాలంగా నాకు జోష్ రావడం లేదు. కానీ ఇక్కడికి వచ్చి ఇంతమంది అభిమానులను చూసిన తర్వాత నాలో మళ్లీ ఆ జోష్ వచ్చింది. మీ అందరి ప్రేమ, అభిమానం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. నా చేతికి గాయం అయిన తర్వాతే ‘డ్రాగన్’ షూటింగ్ ప్రారంభించాం. సినిమా విషయంలో ఎలాంటి డిలే ఉండదు. మేము కమిట్ అయిన డేట్‌కే సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కాబట్టి అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డోంట్ వర్రీ ఫ్యాన్స్..

కరోనా తర్వాత మనమంతా చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నాం. ప్రతి ఒక్కరి కుటుంబంలోనూ తల్లిదండ్రులు, పిల్లలు, బంధువులు.. ఎంతోమందిని కోల్పోయిన బాధాకరమైన సందర్భం అది. అలాంటి కష్టకాలంలో కూడా మనల్ని సినిమాలు, కళ, నటీనటుల ప్రతిభ ఎంతో ఓదార్చాయి. అలాంటి సమయంలో ‘బెంగళూరు డేస్’ సినిమాతో తన అద్భుతమైన నటనతో మన ముందుకు వచ్చిన వ్యక్తి ఫహద్ ఫాజిల్. నాకు చాలా తక్కువ మంది నటులు ఇష్టం. అలాంటి అతికొద్ది మంది నటుల్లో ఫహద్ ఫాజిల్ కూడా ఒకరు. ఫహద్.. మీరు నాకు బ్రదర్ లాంటి వారు. మీరు భారతదేశం గర్వించదగ్గ నటుడు. తెలుగులో మీరు ఇస్తున్న తొలి ఎంట్రీ అద్భుతంగా ఉండాలని, ఈ సినిమా మీకు మంచి విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

ఇక డైరెక్టర్ శశాంక్ గురించి చెప్పాలంటే.. జీవితంలో మనం అనుకున్నది సాధించలేకపోతే చాలాసార్లు మన గమ్యాన్ని మార్చుకుంటూ ఉంటాం. కానీ శశాంక్ అలా చేయలేదు. తన ప్యాషన్‌ను నమ్ముకుని, తాను అనుకున్నదే సాధించి డైరెక్టర్ అయ్యాడు. తమ్ముడు శశాంక్ ఎంతో ప్యాషన్‌తో చేసిన ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా టీమ్ మొత్తానికి నా బెస్ట్ విషెస్ అని’’ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. 

ఫాంటసీ, థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. రాజమౌళి సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మించిన ఈ చిత్రాన్ని శశాంక్ యేలేటి తెరకెక్కించారు. ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

►ALSO READ | NTR Trivikram: ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్' స్క్రిప్ట్ రెడీ... త్రివిక్రమ్ గ్రాండ్ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్‌కు పూనకాలు!

ఇక గాయం తర్వాత తారక్ ఇచ్చిన తొలి పబ్లిక్ స్పీచ్ కావడంతో ఈ ఈవెంట్‌కు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. స్టేజ్‌పై ఎన్టీఆర్ కనిపించగానే అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. తనదైన ఎనర్జీతో మాట్లాడిన తారక్.. సినిమా టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పడంతో పాటు, ప్రేక్షకులు ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ను థియేటర్లలో ఎంజాయ్ చేయాలని కోరారు.

ప్రస్తుతం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ కంటే కూడా.. ఈ సినిమా ఈవెంట్‌లో ఎన్టీఆర్ చెప్పిన మాటలే సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చనీయాంశంగా మారాయి. తారక్ స్పీచ్‌కు సంబంధించిన క్లిప్స్ వైరల్ అవుతుండటంతో.. అక్టోబర్ 2న థియేటర్లలోకి రానున్న ఫహాద్ ఫాజిల్ సినిమాకు ఈ క్రేజ్ ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.