ముల్తానీల్లో మార్పు కోసం ప్రయత్నం..పాకిస్తాన్ నుంచి వచ్చి 160 ఏళ్లుగా జీవిస్తున్న 3 వేల కుటుంబాలు

ముల్తానీల్లో మార్పు కోసం ప్రయత్నం..పాకిస్తాన్ నుంచి వచ్చి 160 ఏళ్లుగా జీవిస్తున్న 3 వేల కుటుంబాలు
  • వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులపై స్టడీకి కమిటీ 
  • ఉపాధి, సామాజిక కార్యక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక
  • ఏళ్లుగా కలప స్మగ్లింగ్​నే వృత్తిగా చేసుకున్న ముల్తానీలు 
  • పోలీసులపై దాడులతో కేసులపాలు 

ఆదిలాబాద్, వెలుగు:  ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా ఇచ్చోడ మండలం కేశపట్నం, గుండాల, జోగిపేట్, ఎల్లమ్మగూడ గ్రామాల్లో కరుగట్టిన నేర ప్రవృత్తి కలిగి, కలప స్మగ్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నే వృత్తిగా చేసుకున్న ముల్తానీల మార్పు కోసం.. అధికార యంత్రాంగం మరో ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. వారికి ఉపాధి, అభివృద్ధి అవకాశాలు కల్పించేందుకు సిద్ధమవుతోంది. 

ఈ క్రమంలోనే ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ రాజర్షి షా ముల్తానీల ఉపాధి, సామాజిక కార్యక్రమాలపై ప్రభుత్వానికి రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందించాలని నిర్ణయించారు. ఇటీవల ముల్తానీలు తమకు ఉపాధి, ఆర్థిక వనరులు కల్పించాలని కోరుతూ మైనార్టీ శాఖ మంత్రిని కలిసి విన్నవించారు.

 ఈ నేపథ్యంలో కలెక్టర్ ముల్తానీల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై స్టడీ చేసేందుకు ఇటీవల కమిటీ ఏర్పాటు చేశారు. ఈనెల 29న కేశపట్నం గ్రామంలో సమావేశం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ పలు కారణాలతో వాయిదా వేశారు. కమిటీ అందించే రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. 

వందల కేసులు.. జైలు పాలు..

పాకిస్తాన్ మూల్తాన్ ప్రావిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముస్లిం గిరిజన తెగకు చెందిన వీరు దాదాపుగా 160 ఏళ్ల కింద ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. దేశ విభజన తర్వాత వీరు తిరిగి వెళ్లలేదు. ఇచ్చోడ మండలం కేశవపట్నం, గుండాల, ఎల్లమ్మగూడ, జోగిపేట్ గ్రామాల్లో దాదాపు 3 వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ గ్రామాల చుట్టూ దట్టమైన అటవీ ఉండటంతో కలప స్మగ్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వృత్తిగా మలుచుకున్నారు. 

ముల్తానీలు ఉండే గ్రామాలకు ఇతరులు ఎవరూ వెళ్లేందుకు సాహసం చేయరు. కలప స్మగ్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అడ్డుకునేందుకు పోలీసుల సాయంతో ఫారెస్టు అధికారులు కేశపట్నం, గుండాల ప్రాంతాల్లో తనిఖీలు చేసేవారు. తనిఖీల సమయంలో పోలీసులపై కర్రలు, రాళ్లతో దాడులు చేస్తూ తప్పించుకుంటున్నారు. 

గతేడాది జూలైలో కేశపట్నం ఫారెస్టులో మొక్కలు నాటేందుకు వెళ్లిన పోలీసులపై దాడులు చేయడంతో ఎస్సైతో పాటు పలువురికి గాయాలయ్యాయి. వాహనాలు ధ్వంసం చేశారు. ఇలా ఒక్కసారి కాదు దశాబ్దాలుగా ఇలాగే కొనసాగుతున్న వారిలో మార్పు రావడం లేదు. దాడులు జరిగిన ప్రతిసారి వందల కేసులు నమోదై ముల్తానీలు జైలు పాలవుతున్నారు. 

ప్రయత్నం ఫలించేనా..

ఎన్నో ఏళ్లుగా ముల్తానీల్లో మార్పు తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. తాజాగా కలెక్టర్ ముల్తానీల జీవన స్థితిగతులపై అధ్యయనం కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

స్థానిక తహసీల్దార్ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, ఎంపీడీవో సభ్యుడిగా, జిల్లా మైనార్టీ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కన్వీనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ ముల్తానీల గ్రామాల్లో పర్యటించి వారి స్థితిగతులపై నివేదికను కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అందజేయనున్నారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం ముల్తానీ యువత కోసం ఉపాధి కల్పనకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 

ప్రభుత్వం నుంచి సబ్సిడీ రుణాలు, ఉపాధి మార్గాలు చూపాలని ముల్తానీ యువత కోరుతోంది. వీరు నాలుగు గ్రామాల్లో దాదాపుగా 10వేల వరకు ఉన్నారు. వీరిలో 30 శాతం మంది పిల్లలు నిరాక్షరాస్యులే ఉన్నారు. ముల్తానీ, హిందీ తప్ప ఇతర ఏ భాషాలు రావు. అపరిమిత సంతానం కూడా వీరి కుటుంబాలను ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు. కుటుంబ నియంత్రణపై అవగాహన లేదు. ముఖ్యంగా ఈ గ్రామాల్లో బడీడు పిల్లలకు నిర్బంధ విద్యను అందించాల్సి ఉంటుంది. కానీ చాలా మంది పిల్లలు ప్రాథమిక విద్యతోనే చదువు మానేస్తున్నారు. 

ముల్తానీల పరిస్థితులపై త్వరలో అధ్యయనం

ఇచ్చోడ మండలంలోని నాలుగు గ్రామాల్లో ఉంటున్న ముల్తానీల సామాజిక, ఆర్థిక ఉపాధి అంశాలపై త్వరలో అధ్యయనం చేయనున్నాం. కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ గ్రామసభ నిర్వహించి వారి అభిప్రాయాలు సేకరిస్తాం. పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందిస్తాం. ఈ సభలకు అన్ని శాఖల జిల్లా అధికారులు రానున్నారు.

-  ఇమ్రాన్ ఖాన్, తహసీల్దార్, ఇచ్చోడ