తిరుపతిలో విషాదం..క్రేన్ కూలి ముగ్గురు మృతి

తిరుపతిలో  విషాదం..క్రేన్ కూలి ముగ్గురు మృతి

తిరుపతిలోని డీబీఆర్ రోడ్డులో శ్రీ కన్వెన్షన్ సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హోటల్ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో భారీ క్రేన్ ఒక్కసారిగా విరిగి పునాదుల ప్రాంతంలో పడటంతో ముగ్గురు మృతి చెందారు.  మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.  

శ్రీ కన్వెన్షన్ పక్కన హోటల్ నిర్మాణం కోసం సుమారు 50 అడుగుల లోతులో పునాదుల పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భారీ చెట్టును తొలగించే పనులు చేపట్టారు. మట్టి తొలగింపు, ఇతర నిర్మాణ పనుల్లో ఉపయోగిస్తున్న భారీ క్రేన్ ఒక్కసారిగా విరిగి పునాదుల వద్దకు కూలిపోయాయి.   క్రేన్ కింద పలువురు కార్మికులు చిక్కుకుపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ కింద చిక్కుకున్న ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

మృతులను ఒడిశాకు  చెందిన రామారావు (45), శ్రీకాకుళం జిల్లాకు చెందిన సివిల్ ఇంజనీర్ సందీప్ (34), తిరుపతికి చెందిన గార్డెన్ వర్కర్ చెంగయ్య (40)గా గుర్తించారు.  ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

►ALSO READ | తిరుమల భద్రతపై స్పెషల్ ఫోకస్.. అక్టోపస్ కమాండోల హై-వోల్టేజ్ డ్రిల్

ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. నిర్మాణ పనుల్లో భద్రతా ప్రమాణాలు పాటించారా? క్రేన్ ప్రమాదానికి కారణాలేమిటనే అంశాలపై పోలీసులు, సంబంధిత అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. సహాయక చర్యలు, ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.