శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో ఘోరం జరిగింది. తోటి జవాన్ జరిపిన కాల్పుల్లో నలుగురు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సిబ్బంది మృతి చెందారు. కతువా జిల్లాలోని బసోహ్లి-సేవా 2 ప్రాజెక్ట్ సైట్‌లో మంగళవారం (సెప్టెంబర్ 29) ఈ దారుణం జరిగింది. కాల్పులు జరిపిన జవాన్‌ను కతువా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
కతువా జిల్లా బసోలిలోని సేవా-2 హైడ్రో పవర్ ప్రాజెక్టు దగ్గర సీఐఎస్ఎఫ్ సిబ్బంది గస్తీ కాస్తున్నారు. మంగళవారం (సెప్టెంబర్ 29) షిఫ్ట్‌లు మారే సమయంలో సిబ్బంది వివాదం తలెత్తింది. గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన సీఐఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ అవధేష్ సింగ్ తన సహోద్యోగులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
ఈ కాల్పుల్లో అసిస్టెంట్ కమాండెంట్ అంకిత్ కుమార్ పాండే, సబ్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ్ సింగ్, కానిస్టేబుల్ రఫీక్ అహ్మద్, కానిస్టేబుల్ సందీప్ కుమార్ అక్కడికక్కడే మరణించారు. అధికారుల ఫిర్యాదు మేరకు కతువా జిల్లా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
►ALSO READ | అరుణాచల్ ప్రదేశ్‌లో ఆర్మీపై ఎటాక్.. జవాన్ వీరమరణం.. మరో నలుగురికి గాయాలు
నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై సీఐఎస్ఎఫ్ కూడా అంతర్గత విచారణ చేపట్టింది. సీఐఎస్ఎఫ్ డీజీ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించారు. అసలు వాగ్వాదం ఎందుకు జరిగింది..? కాల్పులకు దారితీసిన పరిస్థితులు ఏంటన్నది తెలియాల్సి ఉంది.
