- ఐజీ ఆఫీస్‌కు రిపోర్ట్ చేయాలని నలుగురికి ఆదేశాలు
ఖమ్మం, వెలుగు: ఖమ్మం పోలీసు కమిషనరేట్ పరిధిలో సోమవారం సీఐల బదిలీలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మల్టీ జోన్-1 ఐజీ సంతోష్ చంద్రశేఖర్ రెడ్డి జారీ చేసిన తాజా ఉత్తర్వుల్లో పలువురు సీఐలను బదిలీ చేయగా, ముఖ్యంగా ఖమ్మం సిటీలో కీలక బాధ్యతల్లో పనిచేస్తున్న నలుగురు అధికారులకు స్థానచలనం కలిగింది.
ఖమ్మం టూ టౌన్ సీఐ బొమ్మెర బాలకృష్ణ, ఖానాపురం హవేలీ సీఐ రాదం భానుప్రకాశ్, త్రీ టౌన్ సీఐ జిల్లెళ్లమూడి మోహన్ బాబు, ఖమ్మం ట్రాఫిక్ సీఐ బెల్లం సత్యనారాయణకు పోస్టింగ్‌లు కేటాయించలేదు. బదిలీ అయిన ఈ అధికారులను హైదరాబాద్‌లోని మల్టీ జోన్-1 ఐజీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
సిటీలోని నలుగురు సీఐల పరిధిలో కీలక స్టేషన్లలో పనిచేస్తున్న వీరికి.. పోస్టింగ్‌లు కేటాయించకపోవడంపై చర్చనీయాంశంగా మారింది. రాజకీయ, పరిపాలనా కారణాలా లేక అంతర్గత వ్యవహారాల వల్ల పోస్టింగ్ ఇవ్వలేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు నగరంలోని వివిధ స్టేషన్లకు కొత్త సీఐలను నియమించారు.
సీఎస్‌బీలో పనిచేస్తున్న జ్ఞానదృష్టి రామకృష్ణను ఖమ్మం టూ టౌన్ ఎస్‌హెచ్‌వోగా, ఇంటెలిజెన్స్ విభాగం నుంచి ఎండి. సాధిక్ పాషాను ఖమ్మం వన్ టౌన్ ఎస్‌హెచ్‌వోగా, ఖమ్మం వన్ టౌన్ ఎస్‌హెచ్‌వో కరుణాకర్‌ను వీఆర్ కు పంపి, రఘునాథపాలెం పీఎస్ అటాచ్‌మెంట్ ఇచ్చారు. ఉమెన్ పీఎస్ ఎస్‌హెచ్‌ఓగా ఉన్న చిట్టిబాబును ఖమ్మం త్రీ టౌన్‌కు, రఘునాథపాలెం ఎస్‌హెచ్‌వో ఉస్మాన్ షరీఫ్‌కు మహిళా పీఎస్ బాధ్యతలు ఇచ్చారు. అలాగే సీటీసీలోని శివప్రసాద్‌ను ట్రాఫిక్ ఎస్‌హెచ్‌వోగా నియమించారు.
