హైదరాబాద్ : గణేష్ నిమజ్జన పూర్వ ఉత్సవాల సందర్భంగా మహిళలు, యువతుల భద్రతకు హైదరాబాద్ నగర పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్,అదనపు పోలీస్ కమిషనర్ (క్రైమ్స్), హైదరాబాద్ నగరం ఆదేశాల మేరకు సెప్టెంబర్ 14- నుంచి 26 వరకు ఖైరతాబాద్ గణేష్, బాలాపూర్ గణేష్ మంటపాలతో పాటు ప్రధాన గణేష్ మండపాలు, రద్దీ ప్రాంతాలు, నిమజ్జన మార్గాల్లో షీ టీమ్స్‌ను భారీగా మోహరించారు.
గణేష్ ఉత్సవాల సందర్భంగా ఈవ్‌టీజింగ్, మహిళలు , యువతులను వేధించడం, ఇతర ఆక్షేపణీయ కార్యకలాపాలను అరికట్టేందుకు షీ టీమ్స్ ప్రత్యేక నిఘా కొనసాగించాయి. అనుమానాస్పదంగా వ్యవహరించిన వ్యక్తులపై నిఘా ఉంచడంతో పాటు, మహిళలు, యువతుల భద్రతకు విఘాతం కలిగించే చర్యలను గుర్తించి వెంటనే స్పందించాయి.
2,935 మంది అదుపులోకి
ప్రత్యేక నిఘా , తనిఖీల్లో భాగంగా ఈవ్‌టీజింగ్, వేధింపులు, ఇతర ఆక్షేపణీయ కార్యకలాపాలకు పాల్పడిన మొత్తం 2,935 మందిని షీ టీమ్స్ అదుపులోకి తీసుకున్నాయి.858 మందికి కౌన్సెలింగ్ నిర్వహించి, హెచ్చరించి వదిలిపెట్టారు.69 మందికి శిక్ష విధించబడింది.24 మందికి రూ.1,050 జరిమానా విధించారు.40 మందికి సామాజిక సేవతో పాటు రూ.1,050 జరిమానా విధించారు.5 మందికి జరిమానాతో పాటు జైలు శిక్ష విధించారు.
రద్దీ ప్రాంతాల్లో నిరంతర నిఘా
ఖైరతాబాద్, బాలాపూర్ గణేష్ ఉత్సవాలపై ప్రత్యేక దృష్టి సారించిన షీ టీమ్స్.. ప్రధాన గణేష్ మంటపాలు, అధిక రద్దీ ప్రాంతాలు, నిమజ్జన మార్గాల్లో నిరంతరం నిఘా కొనసాగించాయి. మహిళలు, యువతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రత్యేక బృందాలు అప్రమత్తంగా వ్యవహరించాయి.ఉత్సవాల సమయంలో ఈవ్‌టీజింగ్, వేధింపులు, మహిళల భద్రతకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, ప్రజలు సురక్షిత వాతావరణంలో పండుగలను నిర్వహించుకునేలా హైదరాబాద్ నగర పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని అధికారులు తెలిపారు.
►ALSO READ | మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్‌బీనగర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై ఎంఎంసీ కొరడా
