నిన్నటి వరకు లేడీ పోలీస్ సింగం: ఇప్పుడు 50 వేల లంచంతో జైలుకు.. అయినా తగ్గేదేలా అంట..!

నిన్నటి వరకు లేడీ పోలీస్ సింగం: ఇప్పుడు 50 వేల లంచంతో జైలుకు.. అయినా తగ్గేదేలా అంట..!

పంజాబ్ రాష్ట్రం. రాజధాని చంఢీఘడ్ సిటీలోని కోట్ ఇసాఖాన్ పోలీస్ స్టేషన్. ఆ స్టేషన్ ఇంచార్జీగా మహిళా పోలీస్ అధికారి సునీతా బావా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ కాలంలో పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే ఏ రేంజ్ లో అధికారం ఉంటుందో తెలుసు కదా.. అందులోనూ మహిళా. ఈమెను అందరూ లేడీ సింగం అంటూ ఎలివేషన్స్ ఇస్తుంటారు సోషల్ మీడియాలో. అందుకు తగ్గట్టుగానే సునీతా బావా హల్ చల్ చేస్తుంటారు. అలాంటి లేడీ ఆఫీసర్ ఇప్పుడు జైల్లో ఉన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

కోట్ ఇసాఖాన్ పోలీస్ స్టేషన్ లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా పని చేస్తున్న సునీతా బావా కొన్ని రోజుల క్రితం తనిఖీల్లో భాగంగా డ్రగ్స్ కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసింది. విచారణలో భాగంగా అతను నూర్ పూర్ హకీమియాన్ గ్రామానికి చెందిన రవీందర్ సింగ్ పేరు చెప్పాడు. కేసు అక్కడే మలుపు తిరిగింది. రవీందర్ సింగ్ తో సునీతా బావా లాబీయింగ్ చేసింది. డ్రగ్స్ కేసులో ఇరికించకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అసలే లేడీ సింగం అంటూ ఎలివేషన్స్ లో ఉన్న సీఐ.. డ్రగ్స్ అంటున్నది అని భయపడిన రవీందర్ సింగ్.. సీఐ సునీత బావాతో బేరం మాట్లాడుకున్నాడు. 50 వేల రూపాయలు ఇస్తే వదిలేస్తానంటూ చెప్పుకొచ్చింది. అందులో భాగంగా 50 వేల రూపాయలు సీఐ సునీతా బావాకు ఇచ్చాడు రవీందర్ సింగ్. 

అప్పటికీ ఆశ చావలేదు. మళ్లీ 50 వేల రూపాయలు డిమాండ్ చేసింది ఈ లేడీ సీఐ సునీతా బావా. ఇది ఇలాగే కొనసాగుతుందని.. మళ్లీ మళ్లీ డబ్బులు అడుగుతుండటంతో.. ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు రవీందర్ సింగ్. ఈ క్రమంలోనే రాత్రి 9 గంటల సమయంలో డ్యూటీలో ఉన్న సీఐ సునీత దగ్గర డబ్బులు తీసుకుని వచ్చాడు రవీందర్ సింగ్. ఆ డబ్బులను నేరుగా తీసుకోకుండా.. తన గన్ మెన్ ఆ డబ్బులను తీసుకున్నాడు. ఆ సమయంలో లేడీ సీఐ సునీత పక్కనే ఉన్నాడు. డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారణ చేశారు. 

ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి తీసుకెళుతున్న సమయంలో లేడీ సీఐ సునీత చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతా బాగానే ఉంది కదా.. ఎందుకు హడావిడి చేస్తున్నారంటూ మీడియాతో నవ్వులు పూయించారు. అంతేనా.. ఇప్పుడు ఒక కొత్త జైలు జీవితం మొదలైంది.. ఏం జరుగుతుందో చూద్దాం అంటూ మీడియా అడగకుండానే నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ మీరు నవ్వుతూ ఎలా ఉండగలగుతున్నారు అంటూ మీడియా ప్రశ్నిస్తే.. ఖచ్చితంగా దైర్యంగా ఉండాలి.. ఇలాంటివి వస్తూనే ఉంటాయి.. ఇదేమీ సమస్య కాదు.. అంతా మంచే జరగాలని ఆశిద్దాం అంటూ జైలుకు వెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. లంచంతో దొరికిన లేడీ సీఐ ఎంత దర్జాగా నవ్వుతూ ఉంది.. వ్యవస్థ అంటే ఆమెకు అంత చులకనా ఏంటీ.. లంచం తీసుకున్నాను అనే భయం లేదు.. సిగ్గు లేదు.. ఆ దైర్యం చూస్తుంటే జైలు నుంచి వచ్చిన తర్వాత మళ్లీ డ్యూటీలో జాయిన్ అవుతాను అన్న ధీమా వ్యక్తం అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. 

ALSO READ : ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మైనర్ల కంటెంట్

ఏదిఏమైనా నిన్నా మొన్నటి వరకు సోషల్ మీడియాలో లేడీ సింగం అంటూ  ఎలివేషన్స్ ఇచ్చినోళ్లు అంతా ఇప్పుడు కంత్రీ.. జగత్ కిలాడీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. రీల్స్ చేస్తున్నారు.. వీడియోలు చేస్తున్నారు..