ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మైనర్ల కంటెంట్.. మెటాకు మానవహక్కుల కమిషన్ నోటీసులు

ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మైనర్ల కంటెంట్.. మెటాకు మానవహక్కుల కమిషన్ నోటీసులు

ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ లబ్ధి కోసం చిన్నారులను పావులుగా మలుస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఒక కోచింగ్ సెంటర్‌లో చదువుతున్న చిన్నారులతో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా స్క్రిప్ట్ రాయించి, రాజకీయ విమర్శలతో కూడిన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు. దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) సుమోటోగా స్పందించి, సంబంధిత వర్గాలకు నోటీసులు జారీ చేసింది.

సోషల్ మీడియాలో వైరల్..
ఎక్స్ వేదికగా ముజి సింగ్ రంగి షేర్ చేసిన పోస్ట్ ఆధారంగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఉత్తర ప్రదేశ్‌లోని ఎటాహ్ జిల్లాలో ఉన్న ఒక కోచింగ్ సెంటర్‌కు చెందిన చిన్నారులతో రాజకీయంగా ప్రేరేపితమైన నినాదాలు.. "ఓట్ చోరి", "ప్రో- సీజేపీ" వంటి అంశాలతో కూడిన వీడియోలను రికార్డ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో సర్క్యులేట్ చేశారు. చిన్న పిల్లలకు రాజకీయాలపై ఎటువంటి అవగాహన లేకపోయినా.. వారి చేత బలవంతంగా విమర్శలు చేయించడంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

మానవహక్కుల కమిషన్ సీరియస్..
పిల్లల హక్కుల ఉల్లంఘన, గోప్యత, మానసిక క్షోభ, తల్లిదండ్రుల అనుమతి లేకుండా వారిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడంపై NHRC తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎటాహ్ ఎస్ఎస్‌పీ, ఎటాహ్ జిల్లా కలెక్టర్, మెటా ఇండియా కంట్రీ హెడ్, కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేశారు. రెండు వారాల్లోగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించారు.

పిల్లల రక్షణకు, కౌన్సెలింగ్‌కు ఆదేశాలు..
ఈ దర్యాప్తులో భాగంగా వీడియోల్లో కనిపిస్తున్న పిల్లలను వెంటనే గుర్తించి.. వారికి తగిన రక్షణతో పాటు కౌన్సెలింగ్ అందించాలని స్థానిక పోలీసులను కమిషన్ ఆదేశించింది కమిషన్. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను నిర్వహిస్తున్న వ్యక్తులు ఎవరు? ఈ వీడియోల వెనుక ఉండి స్క్రిప్ట్ రాసిన, రికార్డ్ చేసిన, అప్‌లోడ్ చేసిన పెద్దలు ఎవరనే దానిపై లోతుగా విచారణ జరగాలని స్పష్టం చేసింది. ఎక్కడైనా నేరం రుజువైతే వెంటనే కేసు నమోదు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

ALSO READ : పిల్లల సోషల్ మీడియాలో ఖాతాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం

మైనర్లకు సంబంధించిన ఇలాంటి అభ్యంతరకర వీడియోలు ప్లాట్‌ఫారమ్‌లో పదే పదే అప్‌లోడ్ కావడం, సర్క్యులేట్ అవ్వడంపై మెటా సంస్థను మానవ హక్కుల కమిషన్ నిలదీసింది. ఈ కంటెంట్‌ను నిరోధించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలని కోరింది. అలాగే ఈ వీడియోల ద్వారా ఎవరికైనా ఆర్థిక, వాణిజ్యపరమైన లాభాలు చేకూరాయా అనే కోణంలోనూ దర్యాప్తు జరపాలని స్పష్టం చేసింది. పిల్లలను బాధితులుగా కాకుండా రక్షణ అవసరమైన బాలలుగా చూడాలని, అసలైన సూత్రధారులపైనే చర్యలు ఉండాలని కమిషన్ తేల్చిచెప్పింది.