పిల్లల సోషల్ మీడియాలో ఖాతాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం.. 18 ఏళ్ల లోపు వారికి బంద్‌!

పిల్లల సోషల్ మీడియాలో ఖాతాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం.. 18 ఏళ్ల లోపు వారికి బంద్‌!

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చిన్నారుల ఖాతాల నిబంధనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 12 నుంచి 13 ఏళ్ల పిల్లలు సోషల్ మీడియా ఖాతాలు ఎలా తెరుస్తారని, ఇది దేశ చట్టాలకు విరుద్ధమని ప్రధాన జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. భారతీయ ఒప్పంద చట్టం ప్రకారం మైనర్ల సమ్మతి చెల్లదని కోర్టు గుర్తుచేసింది.

నాగరిక సమాజంలో పిల్లల భద్రతను కాపాడేందుకు సరైన రక్షణ అవసరమని కోర్టు అభిప్రాయపడింది. 'జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్' అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా ఈ కీలక ఆదేశాలు వెలువడ్డాయి.

మైనర్లు సోషల్ మీడియా టర్మ్స్ అండ్ కండిషన్స్ అంగీకరించి అకౌంట్లు తెరవడం చట్టవిరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆన్‌లైన్ గ్రూమింగ్, లైంగిక వేధింపులు, సైబర్‌ బుల్లీయింగ్, వ్యక్తిగత డేటా దుర్వినియోగం వంటి తీవ్ర ముప్పుల నుంచి పిల్లలను రక్షించాల్సిన అవసరం ఉందని పిటిషనర్లు వాదించారు.

డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ(DPDP) చట్టం-2023 కొన్ని నిబంధనలు ఇస్తున్నప్పటికీ.. పూర్తిస్థాయి చట్టబద్ధమైన మార్గదర్శకాలు రావాల్సి ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. తగిన విధివిధానాలు రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం సమయం కోరింది.

సామాజిక మాధ్యమాల్లో సభ్యత్వానికి కనీస వయస్సు 18 ఏళ్లుగా నిర్ణయించాలని, లేకపోతే తామే మధ్యవర్తి సంస్థలపై కఠిన ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని సర్వోన్నత ధర్మాసనం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.