రెడ్ బుల్‌కు మళ్లీ 'రెక్కలు'.. FSSAIకి షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు.. 'ఎనర్జీ డ్రింక్' అని రాసుకోవచ్చు..

రెడ్ బుల్‌కు మళ్లీ 'రెక్కలు'.. FSSAIకి షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు.. 'ఎనర్జీ డ్రింక్' అని రాసుకోవచ్చు..

ఎనర్జీ డ్రింక్ దిగ్గజం 'రెడ్ బుల్'కు ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది.  'రెడ్ బుల్ క్యాన్‌లపై 'ఎనర్జీ డ్రింక్' అనే పదాన్ని వాడకూడదంటూ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. కంపెనీకి  వాదనను వినిపించేందుకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండానే FSSAI ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని గమనించిన హైకోర్టు, మంగళవారం ఆ ఆదేశాలను పక్కన పెట్టింది.

ఇండియాలో రోజురోజుకూ పెరుగుతున్న హై కెఫీన్ పానీయాల మార్కెట్‌లో 'ఎనర్జీ డ్రింక్' అనే లేబుల్‌ వాడకంపై కేంద్ర నియంత్రణ సంస్థ FSSAI ఆంక్షలు విధించింది. జూన్ నెలలో కెఫీన్ ఎక్కువగా ఉండే పానీయాల తయారీదారులు వాటి ఉత్పత్తులపై 'ఎనర్జీ డ్రింక్' అని రాయకూడదని ఆదేశించింది.

దీనిపై రెడ్ బుల్‌తో పాటు పెప్సీ, మాన్‌స్టర్, రిలయన్స్ వంటి ప్రముఖ కంపెనీలు తీవ్ర ఆందోళన చెందాయి. ‘ఎనర్జీ డ్రింక్’ అనే పదాన్ని తొలగిస్తే, తక్షణ శక్తినిచ్చే పానీయాలుగా మార్కెట్‌లో మా బ్రాండ్లకు ఉన్న గుర్తింపు దెబ్బతింటుందని భావించాయి. దీంతో రెడ్ బుల్ సంస్థ FSSAI నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

హైకోర్టు ఏం చెప్పిందంటే 
ఉత్పత్తి నాణ్యతలో లేదా ప్రమాణాల్లో ఎలాంటి మార్పూ లేనప్పుడు, ఒక్కసారిగా ఇలాంటి నిషేధం విధించడం వ్యాపార పెట్టుబడులపై దెబ్బతీస్తుందని రెడ్ బుల్ వాదించింది. ఈ వాదనతో ఏకీభవించిన కోర్టు.. కంపెనీకి  వివరణ ఇచ్చే కనీస అవకాశం కూడా ఇవ్వకుండా ఉత్తర్వులు జారీ చేయడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. విధానపరమైన లోపాల కారణంతో FSSAI విధించిన ఆంక్షలను కొట్టేసింది.

ఎనర్జీ డ్రింక్స్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు 
ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫీన్, చక్కెర, టౌరిన్ వంటి పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యంపై చూపే ప్రభావంపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఇంగ్లాండ్‌లో వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి 16 ఏళ్లలోపు పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ అమ్మకూడదనే నిషేధం విధించనున్నారు.

ప్రస్తుతానికి ఢిల్లీ హైకోర్టు తీర్పుతో రెడ్ బుల్‌కు రిలీఫ్ లభించిన, ఇది కేవలం FSSAI అనుసరించిన విధానపరమైన లోపానికి సంబంధించినదేనని.. డ్రింక్స్ నాణ్యతా ప్రమాణాల్లో ఎలాంటి మార్పు కాదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.