ఖమ్మం జిల్లాలో భారీ చోరీ వెలుగులోకి వచ్చింది. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ భారీ ఎత్తున చోరీకి పాల్పడ్డారు దుండగులు. వైరా మండలం తాటిపూడి గ్రామంలో దాదాపు 36లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి ఆభరణాల చోరీ ఘటన కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా వైరా మండలం తాటిపూడి గ్రామంలో 2026 సెప్టెంబర్ 27వ తేదీ రాత్రి ఇంటి యజమానులు లేని సమయంలో భారీ చోరీకి పాల్పడ్డారు దొంగలు. వరుసగా రెండు ఇళ్లలో దొంగతనానికి పాల్పడ్డారు గుర్తుతెలియని దుండగులు .
తాటిపూడి గ్రామానికి చెందిన పతాని సునీత ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు 15 తులాల బంగారం, రెండు కేజీల వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. వీటి విలువ 32 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. అదే విధంగా దోసపాటి రాజేశ్వరరావు అనే రైతు ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ దుండగులు.. రెండు తులాల బంగారం, 30 వేల నగదు, విలువైన వెండి వస్తువులు ఎత్తుకెళ్లారు. వీటి విలువ దాదాపు నాలుగు లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు.
రెండు ఇళ్లలో కలిపి సుమారు 36 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి వస్తువులు ఎత్తుకెళ్లారు దొంగలు. స్థానికుల ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న వైరా పోలీసుల.. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
