సంగారెడ్డి సీఎం సభకు సర్వం సిద్ధం..ఏర్పాట్లను పరిశీలించిన జగ్గారెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి

సంగారెడ్డి సీఎం సభకు సర్వం సిద్ధం..ఏర్పాట్లను పరిశీలించిన జగ్గారెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డిలో శనివారం జరగనున్న సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు  టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. సభ ఏర్పాట్లను డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డితో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం బహిరంగ సభను లక్ష మందితో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సభ విజయవంతం కోసం పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్‌‌‌‌‌‌‌‌ గౌడ్, మంత్రులు ఉత్తమ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామిలతో ప్రతిరోజూ రివ్యూ చేస్తున్నామని చెప్పారు. 

సంగారెడ్డి ఐబీ చౌరస్తాలో మాజీ ప్రధానులు జవహర్‌‌‌‌‌‌‌‌లాల్ నెహ్రూ, రాజీవ్‌‌‌‌‌‌‌‌గాంధీ విగ్రహాలను ఆవిష్కరించనున్నారని తెలిపారు. సీఎం సభకు సంగారెడ్డి నియోజకవర్గం నుంచే సుమారు 50 వేల మంది హాజరవుతారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం అరకొరగా రేషన్ కార్డులు ఇచ్చిందని విమర్శించిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టి రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఐదు లక్షల మందికి అందించనుందన్నారు. సభకు వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జర్మన్ షెడ్లు ఏర్పాటు చేస్తున్నామని జగ్గారెడ్డి వెల్లడించారు.

 కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ చేర్యాల ఆంజనేయులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అనంత్ కిషన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జార్జ్, నాయకులు  కిరణ్ గౌడ్, కూన సంతోష్, షఫీ హఫీజ్ పాల్గొన్నారు.