ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: మాజీ మంత్రి హరీశ్‌‌ రావు

ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: మాజీ మంత్రి హరీశ్‌‌ రావు

సిద్దిపేట, వెలుగు : పోలీసు ఉద్యోగాల కోసం సిద్దిపేటలో నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేసిన ‘కేసీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్’ శిక్షణా శిబిరానికి సార్థకత చేకూరాలంటే విద్యార్థులందరూ పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌‌రావు పిలుపునిచ్చారు. పేద విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే తాను ఫీజు భరిస్తున్నానని, రాబోయే నవంబర్ 29 వరకు అర్జునుడికి పక్షి కన్నులా కేవలం లక్ష్యమే కనిపించాలని సూచించారు.

ఈ ఆరు నెలల పాటు సోషల్ మీడియా, రీల్స్, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి కేవలం చదువుపైనే పూర్తిగా దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. గడిచిన 12 ఏండ్లుగా తాను అందిస్తున్న ఈ ఉచిత కోచింగ్ ద్వారా ఎంతో మంది పేద పిల్లలు గ్రూప్స్, పోలీస్ తదితర ఉద్యోగాలు సాధించి తనను కలవడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల హామీలపై ఆయన విమర్శలు గుప్పించారు.

సమాజ బాధ్యతలను బోధించాలి 

సిద్దిపేటలో తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ (టీపీఎస్ఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవంలో హరీశ్‌‌రావు పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు కేవలం మార్కులు, ర్యాంకులే కాకుండా సమాజం పట్ల మంచి బాధ్యతలను నేర్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని పేర్కొన్నారు. మంచి సమాజ నిర్మాణం గురువుల ద్వారానే సాధ్యమని, మనం ఏ ఉన్నత స్థాయికి చేరినా ఉపాధ్యాయులు అందించిన విద్యాబుద్ధులే కారణమని గుర్తుచేశారు.

విద్యార్థులు సెల్ ఫోన్ల వాడకం తగ్గించి, పుస్తక పఠనాన్ని అలవర్చుకోవడం ద్వారా జీవిత పాఠాలు నేర్చుకోవచ్చని తెలిపారు. చిన్న ఒత్తిడికే లోనై విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమని, వారిలో నైతిక స్థైర్యం నింపాలని సూచించారు. అంతకుముందు కొండా లక్ష్మణ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.