ఒక సినిమా థియేటర్లలో విడుదలైన 13 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి రావడం అంటే సాధారణ విషయం కాదు. ఇప్పుడు అయితే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత కొన్ని వారాల్లోనే కొత్త సినిమాలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోకి వచ్చేస్తున్నాయి. కానీ 2013లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజ్‌కుమార్ రావు నటించిన ‘షాహిద్’ (Shahid) మాత్రం ఇన్నేళ్ల పాటు ఓటీటీకి దూరంగానే ఉండిపోయింది. తాజాగా 2026లో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ మొదలవడంతో ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది.
హన్సల్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కిన ‘షాహిద్’.. ప్రముఖ న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త షాహిద్ అజ్మీ జీవితాన్ని ఆధారంగా రూపొందింది. ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి న్యాయ సహాయం అందిస్తూ, ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా పోరాడిన షాహిద్ అజ్మీ జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను ఈ చిత్రంలో చూపించారు. అయితే, 2010లో లాయర్ షాహిద్ అజ్మీ హత్యకు గురైన విషయం తెలిసిందే.
అప్పుడేం జరిగింది.. ఇప్పుడెందుకు వచ్చింది?: అపూర్వ అస్రాని
సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రావడంతో.. ఇంత ఆలస్యానికి కారణమేంటనే చర్చ మొదలైంది. ఇదే ప్రశ్నను ‘షాహిద్’ కో-రైటర్, ఎడిటర్ అపూర్వ అస్రాని కూడా లేవనెత్తారు. 13 ఏళ్లుగా ఈ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కు ఎందుకు దూరంగా ఉందో తాను చాలాసార్లు ఆలోచించానని ఆయన సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. 2013లో సినిమా విడుదలైన తర్వాత దేశంలో అసమ్మతివాదులు, కార్యకర్తలు, జర్నలిస్టులు, నిందితుల హక్కుల కోసం పోరాడేవారిని చూసే విధానంలో మార్పులు వచ్చాయని ట్విట్టర్ వేదికగా ఆయన అభిప్రాయపడ్డారు.
The National Award winning #Shahid is finally streaming on Prime Video. It took 13 years for our film to find a streaming home.
— Apurva M Asrani (@Apurvasrani) September 28, 2026
Shahid tells the story of Shahid Azmi, a lawyer who defended people accused under terror laws and fought for due process in a climate where Muslims… pic.twitter.com/Ms6p6vcB2w
ఈ సందర్భంలో ఉమర్ ఖలీద్ అంశాన్ని కూడా అపూర్వ ప్రస్తావించారు. ఇలాంటి సున్నితమైన అంశాలపై సినిమాలు చేయాలనుకున్న ఫిల్మ్‌మేకర్స్, నటులు, రచయితలు ఎదుర్కొన్న ఇబ్బందులను ఆయన గుర్తుచేశారు. అయితే ‘Shahid’ ఇన్నేళ్లు ఓటీటీలోకి రాకపోవడానికి ఇదే కారణమని ఆయన ఎక్కడా నిర్ధారించలేదు. అయితే 2026లోనే ఈ సినిమాకు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఎందుకు దొరికిందనే ప్రశ్నను మాత్రం ఆయన ముందుకు తెచ్చారు. “పరిస్థితి మారిందా? భయంతో కూడిన రాజకీయాలకు వ్యతిరేకంగా స్పందన పెరుగుతోందా?” అనే సందేహాలను వ్యక్తం చేశారు.
హన్సల్ మెహతా అప్పుడే ఏమన్నారు?
‘Shahid’ డిజిటల్‌లో అందుబాటులో లేకపోవడంపై దర్శకుడు హన్సల్ మెహతా గతంలోనే అసంతృప్తి వ్యక్తం చేశారు. 2022లో స్పందిస్తూ.. సినిమాకు సంబంధించిన హక్కులు ప్రస్తుతం ఎవరి వద్ద ఉన్నాయో, ఒరిజినల్ వెర్షన్ ఎక్కడ ఉందో కూడా తనకు స్పష్టంగా తెలియదని తెలిపారు.
►ALSO READ | కొత్త పాట గురూ: ‘Emo Emo Idi’ నుంచి క్యూట్ మెలోడీ.. యూత్‌ను ఫిదా చేస్తున్న సాంగ్
ఈ పరిస్థితి తనకు, సినిమా టీమ్‌కు, ముఖ్యంగా షాహిద్ అజ్మీ జ్ఞాపకానికి ఒక “వ్యక్తిగత విషాదం” లాంటిదని మెహతా పేర్కొన్నారు. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమై, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సినిమా ఇన్నేళ్ల పాటు ఆన్‌లైన్‌లో ప్రేక్షకులకు అందుబాటులో లేకపోవడం ఆయనను బాధించింది.
రెండు జాతీయ అవార్డులు.. రాజ్‌కుమార్ రావుకు ఉత్తమ నటుడిగా గుర్తింపు
‘Shahid’కు 2012లో టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వరల్డ్ ప్రీమియర్ జరిగింది. అనంతరం 2013 అక్టోబర్‌లో థియేటర్లలో విడుదలైంది. షాహిద్ అజ్మీ పాత్రలో రాజ్‌కుమార్ రావు తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఈ సినిమాకు రెండు జాతీయ అవార్డులు దక్కాయి. రాజ్‌కుమార్ రావుకు ఉత్తమ నటుడిగా, హన్సల్ మెహతాకు ఉత్తమ దర్శకుడిగా అవార్డులు లభించాయి. సమీర్ గౌతమ్ సింగ్, అపూర్వ అస్రాని స్క్రీన్‌ప్లే అందించగా.. అపూర్వ అస్రాని ఎడిటర్‌గా కూడా పనిచేశారు. మహ్మద్ జీషాన్ అయ్యూబ్, ప్రబ్లీన్ సంధు, బల్జీందర్ కౌర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
13 ఏళ్ల తర్వాత.. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు
థియేటర్లలో విడుదలై 13 ఏళ్లు పూర్తయిన తర్వాత ‘Shahid’ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ సినిమా ఓటీటీ ప్రయాణానికి ఎట్టకేలకు తెరపడింది. అయితే, ఇంత సుదీర్ఘ కాలం డిజిటల్ స్ట్రీమింగ్‌కు ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందనే ప్రశ్నకు మాత్రం ఇప్పటికీ ఒకే ఒక్క అధికారిక కారణం బయటకు రాలేదు. హక్కులు, ఒరిజినల్ కాపీకి సంబంధించిన సమస్యలపై హన్సల్ మెహతా గతంలో మాట్లాడగా.. అపూర్వ అస్రాని మాత్రం ఈ ఆలస్యాన్ని అప్పటి సామాజిక, రాజకీయ వాతావరణంతో ముడిపెట్టి ప్రశ్నలు లేవనెత్తారు. అందుకే ‘Shahid’ ఓటీటీ ఎంట్రీ కేవలం ఆలస్యమైన డిజిటల్ రిలీజ్‌గానే కాకుండా.. ఈ 13 ఏళ్ల గ్యాప్ వెనుక అసలు కారణమేంటనే చర్చకు కూడా దారితీస్తోంది.
