ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం

ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం

యాదాద్రి/మెదక్​టౌన్, వెలుగు : ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లాలోని చారిత్రక ప్రదేశాలను ప్రపంచానికి పరిచయం చేయాలని మెదక్ ఎంపీ ఎం. రఘునందన్ రావు పిలుపునిచ్చారు. మెదక్ ఖిల్లాపై కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, మున్సిపల్ చైర్ పర్సన్ రాధికలతో కలిసి ఆయన ర్యాలీని ప్రారంభించి, జిల్లా పర్యాటక అధికారిక వెబ్‌‌సైట్‌‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రధాని మోదీ హయాంలో దేశంలో పర్యాటక రంగం అంతర్జాతీయ స్థాయిలో 39వ స్థానానికి ఎదిగిందని తెలిపారు. మెదక్​ జిల్లాలో పోచారం అభయారణ్యం, ఏడుపాయలు, మెదక్ చర్చి వంటి ప్రాంతాలను ప్రత్యేక టూరిజం సర్క్యూట్‌‌గా అభివృద్ధి చేసేందుకు కలెక్టర్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

జిల్లాలో టూరిజం అభివృద్ధి చెందితే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని భువనగిరి ఖిలా వద్ద ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఇన్​చార్జి కలెక్టర్ ఏ. భాస్కరరావు మాట్లాడుతూ భువనగిరి ఖిలా ఇక్కడి చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప వేదిక అని తెలిపారు.

పర్యాటక రంగం అభివృద్ధి ద్వారా స్థానికులకు ఉపాధి, ఆదాయ మార్గాలు మెరుగవుతాయని, భువనగిరిని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు.