హైదరాబాద్: రవీంద్ర భారతిలో ఆర్. రామ మోహన్ రావు జీవిత చరిత్రతో కూడిన ‘ది సైలెంట్ ఆర్కిటెక్ట్’ పుస్తకాన్ని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి విడుదల చేశారు. ఈ సందర్భంగా.. రామ మోహనరావుతో తనకు సుమారు 25 ఏళ్ల అనుబంధం ఉందని మంత్రి గుర్తుచేసుకున్నారు. కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన గొప్ప కార్మిక నాయకుడు రామ మోహనరావు అని కొనియాడారు.
కార్మికుల కోసం పోరాడినా.. వ్యక్తిగత సంబంధాలను మాత్రం ఎప్పుడూ దెబ్బతీసుకోలేదని చెప్పారు. తన తండ్రి కాకా వెంకటస్వామి విశాఖ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీ ప్రారంభించిన తొలి రోజే రామ మోహనరావు కార్మిక యూనియన్ ఏర్పాటు చేశారని వెల్లడించారు. తాను ఎప్పటికీ కార్మిక నాయకుడినేనని కాకా ఆరోజే స్పష్టం చేశారని, కాకా వెంకటస్వామి సుమారు 100 యూనియన్లకు అధ్యక్షుడిగా ఉండటంతో కార్మిక వర్గంతో ప్రత్యేక అనుబంధం ఉండేదని మంత్రి వివేక్ వెంకటస్వామి గుర్తుచేశారు.
రామ మోహనరావు నిజమైన కార్మిక నాయకుడని, మినిమం వేజెస్ కమిటీ చైర్మన్గా ఉన్న సమయంలో కార్మికులకు న్యాయం జరిగేలా కనీస వేతనాలు ఇప్పించడంలో కీలక పాత్ర పోషించారని వివరించారు. గతంలో సుమారు పదేళ్ల పాటు కనీస వేతనాలు సవరించని పరిస్థితుల్లోనూ కార్మికుల ప్రయోజనాల కోసం ఆయన కృషి చేశారని రామమోహన్ రావు గురించి మంత్రి చెప్పారు.
‘ది సైలెంట్ ఆర్కిటెక్ట్’ అనే పుస్తకం పేరు రామ మోహనరావుకు సరిగ్గా సరిపోతుందని, రామ మోహన రావు బయటకు ప్రశాంతంగా కనిపించినా.. నిర్ణయాలు తీసుకోవడంలో చాలా దృఢంగా ఉంటారని మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండే వ్యక్తిత్వం ఆయనదని, నిశ్శబ్దంగా ఉంటూనే కార్మిక రంగంలో తనదైన ముద్ర వేసిన నాయకుడు రామ మోహనరావు అని మంత్రి వివేక్ వెంకటస్వామి గుర్తుచేశారు.
