మెదక్, వెలుగు: మెదక్ పట్టణంలోని కేజీబీవీని ఆదివారం మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో 319 మంది విద్యార్థులకు కేవలం 12 మరుగుదొడ్లు మాత్రమే ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత పాఠశాలలో ఫ్యాన్లు సరిగా పనిచేయడం లేదని, లో వోల్టేజ్ తో బోర్ మోటార్ పనిచేయక, తాగునీటి సమస్య ఉందని, నాలుగు రోజుల నుంచి స్నానం చేయడం లేదని, సరిపడా మరుగుదొడ్లు లేవని విద్యార్థులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో కేజీబీవీ మేనేజ్మెంట్ తీరుపై ఎంపీ అసహనం వ్యక్తం చేశారు. వెంటనే సొంత నిధులతో స్కూల్ ఆవరణలో బోరు వేయించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు లేకపోవడం దారుణమని, తన ఎంపీ కోటా నుంచి 30 మరుగుదొడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. లో వోల్టేజ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు పాఠశాల ఆవరణలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని ట్రాన్స్‌కో డీఈని ఆదేశించారు.
ఇందుకోసం తన జీతం నుంచి రూ.15 వేలతో మీటర్ కోసం డీడీ కట్టి కొత్త మీటర్ పెట్టించారు. పదవ తరగతి విద్యార్థులకు సైతం ప్రాథమిక అంశాలు రాకపోవడం, ఉపాధ్యాయులు సరిగా బోధించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
