మోడీ, అమిత్ షా, జ్ఞానేష్ రాజీనామా చేయాలి: CWC కీలక తీర్మానాలు

మోడీ, అమిత్ షా, జ్ఞానేష్ రాజీనామా చేయాలి: CWC కీలక తీర్మానాలు

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) డిమాండ్ చేసింది. మంగళవారం (సెప్టెంబర్ 29) దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీ అయ్యింది.

ఈ సమావేశానికి పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్‌తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇతర ముఖ్యమంత్రులు, సీడబ్ల్యూసీ మెంబర్స్ హాజరయ్యారు. సర్ విషయంలో ఎన్నికల సంఘంలో అభిప్రాయభేదాలు, సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష తీరు, దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో ఐదు కీలక డిమాండ్లతో కూడిన ప్రధాన రాజకీయ తీర్మానాన్ని సీడబ్ల్యూసీ ఆమోదించింది. 

 సీడబ్ల్యూసీ తీర్మానాలు ఇవే

బీజేపీతో కుమ్మక్కై ఓట్ల చోరీకి పాల్పడుతున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలి. అతడిపై పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయం

ఈసీని అడ్డు పెట్టుకుని ఎన్నికల వ్యవస్థను నిర్వీర్యం చేస్తోన్న ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలి.

సర్ పేరుతో దేశవ్యాప్తంగా అక్రమంగా తొలగించిన 13.30 కోట్ల ఓట్లను తక్షణమే పునరుద్ధరించాలి.

►ALSO READ | ప్రముఖ వెబ్ సిరీస్ నటి అరెస్ట్ : వ్యభిచార ముఠా లీడర్ గా పోలీసులు గుర్తింపు

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై ఈసీలో విభేదాలు.. సర్ పక్రియలో తీవ్ర అక్రమాలు వెలుగుచూసిన ప్రాంతాల్లో తక్షణమే కాలపరిమితితో కూడిన స్వతంత్ర విచారణ జరిపించాలి.

ఓటర్ల జాబితాలో చేపట్టే మార్పులు చేర్పును రాజకీయ పార్టీలకు సకాలంలో అందించాలి. ఓటు తొలగించే ముందు ఓటరుకు ముందస్తు సమాచారం ఇచ్చి అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించాలి

సీడబ్ల్యూసీ భవిష్యత్ కార్యాచరణ:

ఎన్నికల వ్యవస్థను కాపాడుకునేందుకు కేవలం మాటలకే పరిమితం కాకుండా పార్లమెంటు, కోర్టులలో, ప్రజాక్షేత్రంలో పోరాడాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది. అలాగే, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలు, ఉద్యమాలు చేపట్టాలని డిసైడ్ అయ్యింది.