పోస్టల్ సేవింగ్ స్కీమ్స్ వడ్డీ రేట్లు పెరగనున్నాయా? డబ్బు దాచే ముందు తెలుసుకోండి

పోస్టల్ సేవింగ్ స్కీమ్స్ వడ్డీ రేట్లు పెరగనున్నాయా? డబ్బు దాచే ముందు తెలుసుకోండి

కేంద్ర ప్రభుత్వం స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లపై బుధవారం(సెప్టెంబర్ 30) సమీక్ష నిర్వహించనుంది. 2026 అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి ఈ వడ్డీ రేట్లను ఖరారు చేయనున్నారు. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ప్రభుత్వ బాండ్ల రాబడులు పెరగడం వల్ల రేట్లు పెంచడానికి కొంత అవకాశం ఏర్పడింది. అయినప్పటికీ.. బలమైన సేవింగ్స్ కలెక్షన్లు, ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆకర్షణీయమైన రాబడుల కారణంగా ప్రభుత్వం వడ్డీ రేట్లను మార్చకుండా ఉంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ రేట్లు పెరిగితే మాత్రం 2024 డిసెంబర్ తర్వాత వడ్డీ రేట్లు మారడం ఇదే మొదటిసారి అవుతుంది.

వినియోగదారుల ధరల సూచీ(CPI) ఆధారిత ద్రవ్యోల్బణం గత ఏప్రిల్‌లో 3.48% ఉండగా, ఆగస్టు నాటికి 4.82%కి పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన 6% ఎగువ టాలరెన్స్ పరిమితి కంటే ఇది తక్కువే అయినప్పటికీ.. ధరల పెరుగుదల ఒత్తిడి కొనసాగుతోందని ఇది సూచిస్తుంది. మరోవైపు 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్ ఈల్డ్ కూడా 7% దాటింది. సాధారణంగా స్మాల్ సేవింగ్ స్కీమ్స్ వడ్డీ రేట్లను ఇవే బాండ్ ఈల్డ్స్‌తో పోల్చి అంచనా వేస్తుంటారు. శ్యామలా గోపీనాథ్ కమిటీ సిఫారసుల ప్రకారం బాండ్ ఈల్డ్స్ ఆధారంగా రేట్లు మారాల్సి ఉన్నప్పటికీ.. ప్రభుత్వానికి చట్టపరమైన బాధ్యత ఏమీ ఉండదు. ప్రస్తుతం PPF, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వంటి పథకాలు మంచి రాబడులనే అందిస్తున్నాయి పెట్టుబడిదారులకు.

►ALSO READ | ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మైనర్ల కంటెంట్.. మెటాకు మానవహక్కుల కమిషన్ నోటీసులు

భారీగా వస్తున్న సేవింగ్స్ డిపాజిట్లు..
వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడానికి ప్రధాన కారణం బలమైన ఆర్థిక సమీకరణ. 2026 ఏప్రిల్ - జూలై మధ్య కాలంలో నికర స్మాల్ సేవింగ్ స్కీమ్స్ సేవింగ్స్ కలెక్షన్లు రూ.లక్షా 54వేల కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంలో ఇది కేవలం రూ.98వేల 259 కోట్లు మాత్రమే. అంటే సుమారు 56% వృద్ధి నమోదైంది. ఈ బలమైన ప్రవాహం వల్ల ప్రభుత్వానికి మార్కెట్ అప్పులపై ఆధారపడే భారం తప్పుతుంది. FY27 నాటికి రూ.3లక్షల 59వేల కోట్ల టార్గెట్‌ను మోడీ ప్రభుత్వం నిర్దేశించుకుంది.

ప్రధాన పథకాల ప్రస్తుత వడ్డీ రేట్లు:

1.  పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్: 4.00%
2. పీపీఎఫ్: 7.10%
3. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్: 7.70%
4. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్: 8.20%
5. సుకున్య సమృద్ధి అకౌంట్: 8.20%
6. 5 సంవత్సరాల టైమ్ డిపాజిట్: 7.50%