వ్యవసాయరంగ అభివృద్ధికి బ్యాంకర్లు సహకరించాలి : జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

వ్యవసాయరంగ అభివృద్ధికి బ్యాంకర్లు సహకరించాలి : జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ, వెలుగు : వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతుల అభ్యున్నతికి బ్యాంకర్లు సహకరించాలని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. శుక్రవారం జరిగిన జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు, రుణ లక్ష్యాలు, వ్యవసాయ రుణాల పంపిణీ, ప్రభుత్వ పథకాల పురోగతిపై ఆయన రివ్యూ నిర్వహించి మాట్లాడారు. వ్యవసాయ, పంట రుణాల పంపిణీలో ఎలాంటి జాప్యం ఉండకూడదన్నారు. రైతులకు అవసరమైన సమయంలో రుణాలు అందేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని, అర్హత ఉన్న ప్రతి రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డు అందేలా చూడాలని సూచించారు. 

స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా ఆర్థిక సహకారం అందించి, వారి జీవనోపాధి కార్యకలాపాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు బ్యాంకింగ్ సేవలు సక్రమంగా అందేలా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు. బ్యాంకుల వారీగా నిర్దేశించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతిని క్రమం తప్పకుండా సమీక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. మీటింగ్​లో లీడ్ బ్యాంక్ మేనేజర్ ప్రతిభ, డీఏవో అంబికా సోనీ, డీఆర్డీవో భాస్కర్, ఏపీడీ నూరుద్దీన్, ఏడీ ఎస్సీ కార్పొరేషన్ మాధవి లత, బ్యాంకుల ప్రతినిధులు, నాబార్డ్, వివిధ  శాఖల అధికారులు పాల్గొన్నారు.