IND vs SL 1st Test: భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య రేపు (శనివారం, ఆగస్టు 15) నుంచి గాలేలో మొదటి టెస్ట్ మ్యాచ్ మొదలవుతుందంటే జనాలు పిచ్ ఎట్లుంది? ఎవరు గెలుస్తారు? అని ముచ్చట పెట్టుకుంటారు. కానీ లంకలో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. గ్రౌండ్‌లో వికెట్లు తీయడం, సిక్సర్లు బాదడం పక్కన పెడితే.. ఏకంగా నీళ్ల బాటిళ్ల కోసం, వాటర్ టాప్‌ల దగ్గర పెద్ద రచ్చనే కొనసాగింది. క్రికెట్ మ్యాచ్ చూడడానికి వచ్చినోళ్లకు ఏకంగా సీరియల్ లెవల్ డ్రామా కనిపించింది.
చుక్క నీటి కోసం గల్లీ లెవల్ లొల్లి:
సంగతేందంటే.. ఆగస్టు 8న కొలంబోలోని బ్లూమ్‌ఫీల్డ్ క్రికెట్ అండ్ అథ్లెటిక్ క్లబ్ మైదానంలో యువ ఆటగాళ్లు ప్రాక్టీస్ ముగించుకుని తాగునీటి కోసం టాప్ వద్దకు వెళ్లారు. తీరా చూస్తే అక్కడ చుక్క నీళ్లు లేవు.. అంతే, మనోళ్లకు కోపం వచ్చి క్లబ్ వర్కర్‌తో కార్పొరేషన్ వాటర్ ట్యాంకర్ రేంజ్‌లో పంచాయితీ స్టార్ట్ చేశారు. మాట మాట పెరిగి, మాటల బౌండరీలు దాటి చేతుల దాకా పోయింది. ఒక వర్కర్ ప్లేయర్‌ను కొట్టడానికి పోవడం, దానికి కౌంటర్‌గా వీళ్లు డబ్ల్యూడబ్ల్యూఈ (WWE) రేంజ్‌లో గుద్దులాటకు దిగడంతో రచ్చ రచ్చ అయ్యింది. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో మాజీ కోచ్, ప్రస్తుత క్యూరేటర్ సుమిత్ ఫెర్నాండో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స కొనసాగుతుండగానే మంగళవారం తుదిశ్వాస విడిచారు.
మంచినీళ్ల లొల్లిలో కోచ్ బలైపోయిండు:
సుమిత్ ఫెర్నాండో శ్రీలంక స్కూల్ క్రికెట్ అభివృద్ధిలో సుదీర్ఘకాలం పాటు తన సేవలందించారు. కానీ ఈ చిల్లర పంచాయితీలో పాపం 62 ఏళ్ల సీనియర్ కోచ్ సుమిత్ చనిపోయాడు. గతంలో శ్రీలంక వన్డే కెప్టెన్ కుసాల్ మెండిస్ లాంటి తోపు ప్లేయర్లకే క్రికెట్ పాఠాలు నేర్పించిన ఈ సీనియర్ కోచ్, చివరికి ఈ నీళ్ల గొడవలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో కన్నుమూశాడు. గ్రౌండ్‌లో సిక్సర్లు కొట్టి హీరోలు అవ్వాల్సిన 17 ఏళ్ల స్కూల్ కుర్రాడిని శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేసి చైల్డ్ ప్రోబేషన్ జైలుకు పంపించారు.
భారత్ జాగ్రత్తగా ఉండాల్సిందే:
ఒక పక్క మన కోచ్ గౌతమ్ గంభీర్, సీతాన్షు కొటక్‌లు గాలే పిచ్ ఎట్లుంది? స్పిన్నర్లను దింపాలా? పేసర్లను దింపాలా? అని తలలు పట్టుకుంటుంటే.. లంకలో మాత్రం వాటర్ బాటిల్స్ కోసం వికెట్లతో కొట్టుకుంటున్నారు. ఇక టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ గ్రౌండ్‌కి వెళ్లేటప్పుడు సొంతంగా వాటర్ బాటిళ్లు చేతుల్లో పట్టుకుని పోవడమే బెటర్ ఏమో అని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
