దేశంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్కీమ్ ఆయుష్మాన్ భారత్ - ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన(PM-JAY). ఈ స్కీమ్ ద్వారా అర్హులైన కుటుంబాలకు సంవత్సరానికి రూ.5 లక్షల వరకు ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ అందిస్తోంది. ఎలాంటి ఖర్చు లేకుండా ఆసుపత్రిలో నాణ్యమైన చికిత్స పొందేందుకు ఈ ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ అత్యంత కీలకం.
ఈ హెల్త్ కార్డ్ పొందడం కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం మీ మొబైల్ ఫోన్ లోని అధికారిక వాట్సాప్ చాట్‌బాట్ ద్వారా ఇంట్లోనే కూర్చుని ఈజీగా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన అధికారిక ఆయుష్మాన్ సారథి వాట్సాప్ నంబర్ +91 72908 23838 కు "Hi" లేదా "Hello" అని మెసేజ్ పంపి ఈ ప్రక్రియను ప్రారంభించవచ్చు. ఆ తర్వాత చాట్‌బాట్ సూచనల ప్రకారం 'మై ఆయుష్మాన్ కార్డ్' ఆప్షన్‌ను ఎంచుకుని.. ఈ-కేవైసీ పూర్తి చేసి నేరుగా కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
వాట్సాప్‌తో పాటు ఆన్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే సదుపాయం ఉంది. అధికారిక వెబ్‌సైట్ beneficiary.nha.gov.in ని సందర్శించి మొబైల్ నంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి. రాష్ట్రం, జిల్లా వివరాలు ఎంటర్ చేసి మీ పేరు, గుర్తింపు సంఖ్య ఆధారంగా వివరాలు సెర్చ్ చేయాలి. ఫోటో అప్‌లోడ్ చేసి, అవసరమైన వివరాలు నింపి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
ALSO READ : ఇండిపెండెన్స్ డే ఆఫర్స్: టాప్ బ్రాండ్ టీవీలపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు..
ఈ స్కీమ్ కింద ఎలాంటి ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా 70 సంవత్సరాలు నిండిన వృద్ధులందరూ ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ పొందేందుకు అర్హులే. వీరితో పాటు 2011 సామాజిక-ఆర్థిక కుల గణన(SECC) డేటా ఆధారంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని ఆర్థికంగా వెనుకబడిన అనేక కుటుంబాలకు ఈ వర్తింపు లభిస్తుంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సులభమైన విధానాన్ని ఉపయోగించుకుని ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను పొందవచ్చు.
