ఎమ్మెల్యేల క్యాంటిన్ లోనే బొద్దింకలు.. కంపు కొట్టే ఇడ్లీలు

ఎమ్మెల్యేల క్యాంటిన్ లోనే బొద్దింకలు.. కంపు కొట్టే ఇడ్లీలు

అది రాష్ట్ర అసెంబ్లీ.. అక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే కాదు.. వాళ్ల కోసం వచ్చే ఎంతో మంది ప్రముఖులు. అలాంటి అసెంబ్లీలో క్యాంటిన్.. ఎమ్మెల్యేల క్యాంటిన్ అంటే అద్భుతంగా ఉంటుంది.. అదిరిపోయే ఐటమ్స్.. గుమగుమలాడతాయి అనుకుంటున్నారా.. ఈ విధంగా అనుకుంటే మీరు సాంబరులో కాలు వేసినట్లే.. అవును.. కర్నాటక అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల క్యాంటిన్ తనిఖీ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులకు.. మైండ్ బ్లాంక్ అయ్యింది. కళ్లు బైర్లు కమ్మాయి. క్యాంటిన్ పరిసరాలు చూసి షాక్ అయ్యారు.. అక్కడి ఐటమ్స్ చూసి ముక్కు మూసుకున్నారు. కంపుకొడుతున్న కర్నాటక అసెంబ్లీ క్యాంటిన్ కథ ఏంటో తెలుసుకందాం..

గత కొద్దిరోజులుగా బెంగళూరు సిటీ మొత్తం లో ఉన్న  చిన్న చిన్న హోటళ్లను మొదలుకొని స్టార్  హోటళ్ల వరకు ఏ ఒక్కటి కూడా వదలకుండా తనిఖీ చేస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. అందులో భాగంగా బుధవారం (ఆగస్టు 12) ఉదయం   కర్ణాటక అసెంబ్లీ ప్రాంగణంలోని హోటళ్లపై రైడ్ చేశారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు  బయటికొచ్చాయి. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు వచ్చే ఈ హోటల్ లో కూడా ఫుడ్ లోపాలు బయటపడ్డాయి.  విధాన సౌధ సమీపంలోని లెజిస్లేటర్స్ హౌస్‌లో ఉన్న మల్లిగే హోటల్ రెస్టారెంట్ వంటగదిలో బొద్దింకలు కనిపించాయి. హోటల్‌ మొత్తం  కంపు కొడుతోందని అధికారులు తెలిపారు. 

మాగడి రోడ్డులోని ఆరోగ్య సౌధ క్యాంటీన్‌లో కూడా  ఫుడ్ సేఫ్టీ అధికారులు తనఖీలుచేశారు. హోటల్ మొత్తం అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. గడువు ముగిసిన ఇడ్లీలు, రవ్వ, కొబ్బరి పొడి వంటి కుళ్లిన ఆహార పదార్థాలు గుర్తించినట్లు అధికారులు చెప్పారు. 

మరోవైపు నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా చేసే ఓ గోదాంలో కూడా తనిఖీలు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. నిల్వ ఉంచిన 146 కిలోల చికెన్‌ను సీజ్ చేశారు. FSSAI లైసెన్స్ లేకుండా అడ్డదారిలో కుళ్లిన నాన్ వెజ్ అమ్ముతున్నట్లు గుర్తించారు. దీంతోపాటు 40 కిలోల కాలం చెల్లిన వెల్లుల్లి పేస్ట్ గుర్తించారు. నకిలీ బ్రాండ్ లేబుళ్లతో బియ్యం, డ్రై ఫ్రూట్స్, మసాలాలు అమ్ముతున్నట్లు అధికారుల  తనిఖీల్లో బయటపడింది.  రూల్స్ ఉల్లంఘించిన దుకాణాలకు చట్టపరమైన చర్యలు చేపట్టారు అధికారులు.