తమిళనాడు రాజధాని సిటీ చెన్నైవాసులు ఇప్పుడు విలవిలలాడుతున్నారు. బిల్లులు చూసి బెంబేలు ఎత్తుతున్నారు. దీనికి కారణం ఆస్తి పన్ను బిల్లలు. చెన్నై కార్పొరేషన్ ఇంటింటికీ తిరిగి పంపిణీ చేసిన ఆస్తి పన్ను బిల్లులు.. చెన్నై వాసుల కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. చెన్నై కార్పొరేషన్ పరిధిలో ఉన్న 15 జోన్లలోని అక్షరాల 14 లక్షల మందిపై ఈ ప్రభావం పడింది. ఈ క్రమంలోనే చెన్నై సిటీ వాసులు మొత్తం ఇప్పుడు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అటూ ఇటూ తిరిగి ఇది సీఎం విజయ్ పన్నుల దెబ్బ.. పన్నుల మోతగా కలకలం రేపుతోంది.
గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (GCC) పరిధిలో గత ఆర్థిక సంవత్సరం ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే ప్రాపర్టీ ట్యాక్స్ మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగిందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. సవరించిన డిమాండ్ ప్రకారం ప్రాపర్టీ ట్యాక్స్ ఘోరంగా పెరిగిపోయినట్లు వాపోతున్నారు. దీంతో చాలా మంది నివాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
GCCకి 15 జోన్లలో సుమారు 14 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేవారు ఉన్నారు. అన్నా నగర్‌కు చెందిన రాధికా సుందర్ రాజ్ మాట్లాడుతూ, 2025-26 ఫస్ట్ హాఫ్ లో 5 వేల రూపాయలు ఉన్న ట్యాక్స్ ఇప్పుడు 28 వేల రూపాయలకు పెరిగిందని చెప్పారు. ముందస్తు సమాచారం లేకుండా ఇంత భారీ పెంపు అన్యాయం అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కార్పొరేషన్ అధికారుల ప్రకారం, 2018లో సెల్ఫ్-డిక్లరేషన్ సమయంలో దాదాపు 1.5 లక్షల గృహ యజమానులు ల్యాండ్ అంచనాలో తేడాలున్నట్లు ప్రకటించారు. తర్వాత 3 లక్షల వాణిజ్య, ఇతర భవనాల్లోనూ వ్యత్యాసాలు కనిపించాయి. కోవిడ్ కాలంలో సవరణలు ఆపేసి, ఇప్పుడు తిరిగి అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. 2025-26 సెకండ్ హాఫ్ నుంచి కొత్త అసెస్‌మెంట్ వర్తిస్తుంది.
2024లో ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా డ్రోన్ ఆధారిత GIS సర్వే నిర్వహించి, వాస్తవ విస్తీర్ణం, ప్రకటించిన వివరాల మధ్య తేడాలను గుర్తించి సవరణలు చేశారు. ప్రస్తుతం వాణిజ్య భవనాలపై దృష్టి పెట్టారు. దాదాపు 16 వేల కమర్షియల్ బిల్డింగ్స్ పై రీఅసెస్‌మెంట్ జరుగుతోంది. తర్వాత ఇది ఇండ్లకు కూడా విస్తరించనునట్లు చెప్పారు.
హౌస్ ఓనర్ అసోసియేషన్స్ ఈ ఆకస్మిక పెంపును వ్యతిరేకిస్తున్నాయి. అన్నా నగర్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఫెడరేషన్ (FOARA)కు చెందిన సంధ్యా వేదుల్లపల్లి 10 శాతం నుంచి 300 శాతానికి పైగా పెరుగటాన్ని ఒప్పుకునేది లేదన్నారు.
ఉత్తర చెన్నై రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు టీకే షణ్ముగం మాట్లాడుతూ.. ఈ నిర్ణయం తక్కువ ఆదాయ కుటుంబాలు, చిన్న తోలు పరిశ్రమలపై భారం పడుతుందని, కౌన్సిల్‌లో చర్చ లేకుండా అమలు చేయడం సరికాదని అన్నారు. ఇది మెట్రో వాటర్ ట్యాక్స్‌పైనా ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.
