హైదరాబాద్ బిర్యానీకి అరేబియన్ టచ్..! బర్కాస్ నుంచి బంజారాహిల్స్ దాకా... ఇదే ట్రెండ్..!

హైదరాబాద్ బిర్యానీకి అరేబియన్ టచ్..! బర్కాస్ నుంచి బంజారాహిల్స్ దాకా... ఇదే ట్రెండ్..!

బిర్యానీ అంటే హైదరాబాద్ దమ్ బిర్యానీ.. కానీ ఇప్పుడు నగర ఫుడ్ లవర్స్ టేస్ట్ మారుతోంది. దమ్ బిర్యానీకి తోడుగా అరేబియన్ ఫ్లేవర్‌‌తో మండి బిర్యానీకి ఫుల్ క్రేజ్ ఏర్పడింది. పొగలు కక్కే మాంసం.. సువాసనలు వెదజల్లే బాస్మతీ రైస్.. అరేబియన్ స్టైల్ వంటకం.. వెరైటీ టేస్ట్‌‌తో హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌‌ను మండీ బిర్యానీ నోరూరిస్తోంది. సంప్రదాయ దమ్ బిర్యానీతోపాటు మండీకి కూడా డిమాండ్ పెరుగుతున్నట్టు తాజా ఫుడ్ సర్వే నివేదికలు చెప్తున్నాయి.

బర్కాస్ నుంచి బంజారాహిల్స్ దాకా...

హైదరాబాద్ వాసులకు మండి బిర్యానీ కొత్తేమీ కాదు. నిజాం కాలం నాటి సైనిక స్థావరమైన బర్కాస్‌‌లోని పాత నగర శివారు ప్రాంతంలో ఈ వంటకం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. హైదరాబాద్ నిజాం సైన్యంలో పనిచేయడానికి యెమెన్ నుంచి సైనికులను తీసుకువచ్చేవారు. వారికోసం మండీ బిర్యానీ వడ్డించేవారు. హైదరాబాద్‌‌లోని కొత్త ప్రాంతాల్లో నివసించే ప్రజలు తరచుగా మండీ బిర్యానీ తినడానికి బర్కాస్‌‌కు వెళ్తుంటారు. పట్టణ భోజనప్రియులకు అలవాటైన ఫైన్ - డైనింగ్ సౌకర్యాలు ఏవీ బర్కాస్‌‌లోని భోజనశాలల్లో ఉండవు. 

దీంతో సయ్యద్ అతని సోదరులు ‘మండీ’ రుచిని నగర బిర్యానీ ప్రియులకు అందించేందుకు జూబ్లీహిల్స్‌‌లో ‘మండీ 36’ అనే రెస్టారెంట్‌‌ను ప్రారంభించారు. అప్పటినుంచి బంజారాహిల్స్, గచ్చిబౌలికి తమ శాఖలను విస్తరించారు. మండీ బిర్యానీకి ఆదరణ పెరగడంతో నగరం నలుమూలలా మండీ రెస్టారెంట్లు వెలిశాయి. 

హైదరాబాద్‌‌లోని ప్రధాన మండీ రెస్టారెంట్లలో ఒకటైన ‘ఆజేబో’ వ్యవస్థాపకుడు మహమ్మద్ అయూబ్ సిటీలో నాలుగు అవుట్‌‌లెట్లు ప్రారంభించారు. ఈ ఆధునిక మండీ రెస్టారెంట్లలో ఫైన్ డైనింగ్​తోపాటు కార్పెట్ వేసిన నేలలు, దిండ్లతో కూడిన తక్కువ ఎత్తు గల సీటింగ్, సంప్రదాయ అరబిక్ రాగి పళ్లెంలో వడ్డించే ఆహారం ఉంటాయి. 

అరేబియా మూలాలతో గల్ఫ్ దేశాల్లో ప్రాచుర్యం పొందిన ‘మండీ’ వంటకం, హైదరాబాద్ నగరవాసుల మనసులను గెలుచుకుంది హైదరాబాద్ చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలపై అరబిక్ సంస్కృతి గొప్ప ప్రభావాన్ని చూపింది. నగర వంటకాలు ఎల్లప్పుడూ అరబిక్ ప్రభావంతోనే రూపుదిద్దుకున్నాయి. మండీని ఒక పెద్ద పళ్లెంలో వడ్డిస్తారు.

తయారీ ఇలా...

మండిని తయారుచేయడానికి ముందుగా మసాలాలు కలిపిన రసంలో గొర్రె మాంసాన్ని నెమ్మదిగా ఉడికిస్తారు. మాంసం మెత్తబడిన తర్వాత దానిని పక్కన పెట్టి, అదే రుచికరమైన రసంలో మిరియాలు, దాల్చినచెక్క, జీలకర్ర, ధనియాలు, కుంకుమపువ్వు, యాలకులు వంటి మసాలాలు కలిపి అన్నం వండుతారు. వండిన అన్నం మీద గొర్రె మాంసాన్ని ఉంచుతారు. అయితే సౌదీ అరేబియాలో ఒంటె మాంసం, బీఫ్ కూడా వాడతారు. 

ఈ బిర్యానీని ఎండుద్రాక్ష, బాదం, పిస్తా పప్పులతో అలంకరిస్తారు. హైదరాబాదీ బిర్యానీలో సగం ఉడికించిన అన్నం, మ్యారినేట్ చేసిన మటన్‌ను మసాలాలతో కలిపి దమ్ లేదా ఆవిరి మీద వండుతారని వంట పద్ధతిలోని తేడాను చెఫ్  వివరించారు. మండిలో అసలైన రుచినిచ్చేవి గొర్రె మాంసం రసం, ఎండిన నల్ల నిమ్మకాయలు. ఇవి బిర్యానీలో లేని ఒక ప్రత్యేకమైన తీపి-పులుపు రుచిని అందిస్తాయి అని హోమ్ చెఫ్ ఫాతిమా వివరించారు. 

మండీ రెస్టారెంట్లు.. మస్త్ మస్త్ రుచులు

హైదరాబాద్ సిటీలో ప్రస్తుతం మండీ రెస్టారెంట్లు కూడా విస్తృతంగా వెలిశాయి. మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కాచిగూడ, ఎల్‌‌బీనగర్ వంటి ప్రాంతాలతోపాటు నగరం నలుమూలలా మండీ స్పెషాలిటీ రెస్టారెంట్లు ఉన్నాయి. ఉదాహరణకు గర్ల్‌‌ఫ్రెండ్ మండీ, మండీ @ 36 అరేబియన్ కిచెన్, ముబారక్ అరేబియన్ మండీ హౌస్​లు వంటి బెస్ట్ మండి రెస్టారెంట్లు ఉన్నాయి. బంజారాహిల్స్ జహ్రా నగర్​లోని రోడ్డు నంబరు 10 లోని అరేబియన్ మండీ మంచి టేస్టీ బిర్యానీ వడ్డిస్తున్నారన బిర్యానీ ప్రియులు చెప్తున్నారు. బోడుప్పల్​లోని టౌన్​షిప్​లో ఉన్న మేమే మండీ బిర్యానీ రెస్టారెంట్​లో 200 రూపాయల నుంచి రూ.400 లతో తినగలిగినంత బిర్యానీని వడ్డిస్తున్నారు. 

కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీలోని మండీ కబాబ్ బిర్యానీ హోటల్​లో మటన్ ఘీ రోస్ట్ బిర్యానీ, అరేబియన్ కబాబ్ వేడివేడిగా అందిస్తున్నారు. జూబ్లీహిల్స్​లోని రోడ్డు నంబరు 36 లోని మండీ @ 36 అరేబియన్ కిచెన్​లో చికెన్, మటన్, ఫిష్​తో బిర్యానీ దొరుకుతుంది. సంజీవరెడ్డినగర్ బీకేగూడలో అరేబియన్ మండీ అండ్ బిర్యానీ హౌస్ భోజనప్రియులతో రద్దీగా ఉంటుంది. 

కాచిగూడలోని ముబారక్ అరేబియన్ మండీ హౌస్, తార్నాకలోని బిగ్ ప్లేట్ మండీ, అమీర్ పేటలోని మండీ బిర్యానీ, కుత్బుల్లాపూర్​లోని హలో స్ట్రేంజర్స్ మండీ బిర్యానీ, ఖైరతాబాద్ మండీ టౌన్, బంజారాహిల్స్​లోని గర్ల్ ఫ్రెండ్ మండీ, ఉప్పల్ పిస్తాహౌస్ మండీ, ముషీరాబాద్​లోని అజాన్ బైట్ ఆల్ మండీ, బల్కంపేట బీకేగూడలోని ద మెజిస్టిక్ మండీ బిర్యానీ బిర్యానీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. 

మాస్టర్‌‌చెఫ్ ఆస్ట్రేలియా మాజీ న్యాయనిర్ణేతలు మాట్ ప్రెస్టన్, జార్జ్ కలోంబారిస్, గ్యారీ మెహిగన్​లు హైదరాబాద్‌‌లోని ‘కిస్ మీ మండీ’ అనే మరపురాని పేరుగల ఒక రెస్టారెంట్​లో మండీ బిర్యానీని ఆస్వాదిస్తున్న చిత్రాలు పాకశాస్త్ర ప్రపంచాన్ని ఆకట్టుకున్నాయి.

తేడా ఏంటంటే..

దమ్ బిర్యానీకి, మండీ బిర్యానీకి ప్రధాన తేడా వంట విధానంలో ఉంటుంది. హైదరాబాద్ దమ్ బిర్యానీలో మసాలా, మాంసం, బియ్యాన్ని పొరలుగా వేసి మూతపెట్టి ‘దమ్’పై వండుతారు. మండీ మాత్రం అరేబియన్, యెమెన్ వంట సంప్రదాయానికి చెందినది. సువాసనతో కూడిన బియ్యంతోపాటు నెమ్మదిగా ఉడికించిన లేదా పొగబెట్టిన మాంసం ప్రత్యేకత మండీ బిర్యానీది. హైదరాబాద్‌లో పలు రకాల బిర్యానీ వెరైటీలు ఫుడ్ లవర్స్​ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 

చికెన్, మటన్ దమ్ బిర్యానీ, ఎగ్, వెజ్ బిర్యానీ, కచ్చి గోష్, పక్కీ బిర్యానీ, మండీ, అరబిక్, యెమెన్ స్టైల్ మండీ, చికెన్, మటన్ మండీ, ఫిష్, సీఫుడ్ మండీ, మండీ రైస్, గ్రిల్డ్ చికెన్, మటన్ బిర్యానీ ప్రియులను చవులూరుస్తున్నాయి. చికెన్ బార్బిక్యూ మండీ, చికెన్ ఇరానీ మండీ, నల్లీ ఘోష్ మండీ బిర్యానీ, మండీ థాలీ ప్లేట్ నగర వాసులనే కాకుండా విదేశీ అతిథులను కూడా ఆకట్టుకుంటోంది. 

ఇంత క్రేజ్ ఉండడంతో మండీ రెస్టారెంట్లు పలు డిస్కౌంట్లు కూడా ప్రకటిస్తున్నాయి. బర్కాస్​లోని రెస్టారెంట్లలో మండీ బిర్యానీ రుచి మరవలేనని పాతబస్తీకి చెందిన ముహ్మద్ ముజాహిద్ చెప్పారు.