బెంగళూరు: టెక్నాలజీ, ఇన్నోవేషన్ల సాయంతో ఇండియా జీడీపీ వృద్ధి రేటు 10 శాతం దాటగలుగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బెంగళూరులో ఐఐటీ మద్రాస్ అలుమ్నీ అసోసియేషన్ శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 10 శాతానికి పైగా వృద్ధిరేటు కేవలం ఉత్త మాట కాదని, 'ఆత్మనిర్భర్ భారత్', 'వికసిత్ భారత్' సాధించడంలో ఇది కీలకమని అన్నారు.
అయితే ఇందుకు అన్ని రంగాలు వృద్ధి చెందాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 2015 నుంచి దేశంలో పుంజుకున్న స్టార్టప్‌లు భవిష్యత్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. రైతులను మార్కెట్లతో అనుసంధానించడంలో, ప్రొడక్షన్ పెంచడంలో టెక్నాలజీ చాలా మార్పు తీసుకొచ్చిందని , డ్రోన్లు, ఏరియల్ జియోస్పేషియల్ మ్యాపింగ్ ద్వారా భూముల సర్వే సులువైందని వివరించారు.
‘‘ఎరువుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు పైలట్ ప్రాజెక్ట్‌గా పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మెషీన్లను వాడుతున్నాం. నేల స్వభావం, పంట రకాన్ని బట్టి రైతుకు ఎంత ఎరువు అవసరమో నిర్ణయిస్తాం. రసాయనాల మితిమీరిన వాడకం తగ్గి భూగర్భ జలాలు, నేల కాలుష్యం అదుపులోకి వస్తుంది” అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
