జయశంకర్ భూపాలపల్లి జిల్లా: మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కు వరద ఉధృతి భారీగా పెరుగుతుంది. ఇప్పటికే అధికారులు 85 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు బ్యారేజ్కు వరద తాకిడి అంతకంతకూ పెరుగుతోంది. NDSA సూచనల మేరకు ఇప్పటికే బ్యారేజ్లో పూర్తిగా 85 రేడియల్ గేట్లను అధికారులు ఎత్తి ఉంచారు.
ఆ గేట్ల నుంచి గోదావరి జలాలు దిగువకు వెళ్తున్నాయి. ఇన్ ఫ్లో,ఔట్ ఫ్లో 1,01,530 క్యుసెక్కులు. భారీగా పెరుగుతున్న వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని ముంపు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పరివాహక ప్రాంతాల ప్రజలు ఎవరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారిక సూచనలు పాటించాలని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే.. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ (రీహాబిలిటేషన్) పనులను నవంబర్ రెండో వారంలో ప్రారంభిస్తామని ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
2027 వర్షాకాలం ప్రారంభానికి ముందే ఈ మూడు బ్యారేజీల పునరుద్ధరణ పనులన్నింటినీ పూర్తి చేస్తామని తేల్చిచెప్పారు. మూడు బ్యారేజీల భద్రత, కార్యాచరణ సామర్థ్యాన్ని పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిజైన్లను ఖరారు చేసిందని మంత్రి ఇప్పటికే వెల్లడించారు.
