నీతి కథ : ఒడ్డుకు చేరాక బోడి మల్లయ్య అంటే ఇదేనేమో.. వాడుకుని వదిలేసే వాళ్లకు పుట్టిన సామెత..!

నీతి కథ : ఒడ్డుకు చేరాక బోడి మల్లయ్య అంటే ఇదేనేమో.. వాడుకుని వదిలేసే వాళ్లకు పుట్టిన సామెత..!

నలుగురు స్నేహితులు కలిసి చేపలు పట్టడానికి సముద్రంలోకి ఒక నాటు పడవలో వెళ్లారు. వాళ్లతో పాటు వలలు కూడా తీసుకెళ్లారు. సముద్రంలోకి వెళ్లిన తర్వాత అనుకోకుండా వాతావరణం మారిపోయింది. చిన్నపాటి చినుకులతో వర్షం మొదలైంది. అది కాసేపటికే కుండ పోతగా కురువసాగింది. పడవ నడిపేవాడికి ఎటు వెళ్లాలో, పడవ ఎటు వెళ్తుందో కూడా తెలియడం లేదు. సముద్రం అల్లకల్లోలమయ్యింది. కాసేపటికి పడవ ఒక పెద్ద రాయికి ఢీ కొట్టుకుని ధ్వంసమయ్యింది. లోపలికి నీళ్లు రావడం మొదలైంది.

రాయికి ఒక పక్క కాస్త పల్లంగా ఉండడం వల్ల, ఎలాగోలా ఆ నలుగురు రాయిపైకి చేరారు. కాసేపటికి వర్షం తగ్గిపోయి సముద్రం శాంతించింది. కానీ.. అక్కడినుంచి బయటపడే మార్గం మాత్రం దొరకడం లేదు వాళ్లకి. నలుగురుకీ ఈత రాదు. దేవుడా రక్షించు!  అని మొర పెట్టుకున్నారు. ఇంతలోనే ఒక పెద్ద చేప వాళ్ల దగ్గరకి వచ్చి ఆ వలలు నా మీద పరిచి, వాటిని గట్టిగా పట్టుకుని.. నా మీద కూర్చోండి. మిమ్మల్ని జాగ్రతగా ఒడ్డుకు చేర్చే బాధ్యత నాది అని చెప్పింది ఆ చేప.

ఆ దేవుడే చేప రూపంలో వచ్చాడు అన్నాడు మొదటి వాడు. చేప వాళ్లను తనపై ఎక్కించుకుని.. మెల్లగా ఈదుతూ ఒడ్డు పైపు వెళ్లసాగింది. చేప ఇంత పెద్దగా ఎలా అయ్యింది అని మిగతా వాళ్లని అడిగాడు. రెండో వాడు. ఆ ఏముంది మనం విన్నదే. చిన చేపను పెద్ద చేప.. చిన్న చేపలను తిని.. తిని ఈ చేప ఇంతలా అయ్యింది అన్నాడు మూడో వాడు. ఏం చిన్న వాటిని వదిలెయ్యవచ్చు కదా? అంత క్రూరంగా ఎలా తింటావ్ అన్నాడు నాలుగోవాడు.

►ALSO READ | ఆధ్యాత్మికం : భర్త చెప్పిందే చేసినప్పుడు భార్యకు పాపం అంటదా.. బుద్ధుడు బోధించిన ధర్మోపదేశం ఇదే..!

ఇంతలో ఒడ్డు దగ్గరకు వచ్చారు. నేను నీటిలో ఉండే వాటిని తినడం ప్రకృతి ధర్మం. మేము నేల మీద బ్రతకలేము. మాకు వాటిని తినడం తప్పితే మరో అవకాశం లేదు. కానీ మీరు నేల పైన ఉంటూ.. నేల మీద ఉన్నవే కాకుండా, నీటిలోని చాలా రకాల జలచరాలను తింటారు. మీరు నీటిలోని జలచరాలను తినకపోయినా బతకగలుగుతారు. అయినా తింటారు. మీరు మమ్మల్ని తినొచ్చు. కానీ.. నేను నీటిలోనే ఉండేవాటిని తినడం తప్పా? మీరు అన్న మాటలకు మిమ్మల్ని సముద్రంలోనే వదిలేయాల్సింది. కానీ ఒడ్డుకు చేరుస్తానని మాట ఇచ్చాను. నా పైన కూర్చునే ముందు మత్స్యావతారం అని పొగిడి.. ఒడ్డు దగ్గరకు రాగానే నన్నే నిలదీస్తారా? ఒడ్డు చేరే వరకు ఓడ మల్లయ్య.. ఒడ్డు చేరాక బోడి మల్లయ్య.. అనే రకం మీరు అంది ఆ చేప. ఈ లోగా ఒడ్డు వచ్చింది. నలుగురూ గట్టు చేరారు. ఒడ్డుకు చేర్చినందుకు కృతజ్ఞతలు చెప్పి.. తప్పుగా మాట్లాడినందుకు మన్నించాలని కోరి అక్కడినుంచి వెళ్లిపోయారు. 

అప్పటి నుంచే అవసరం కోసం వాడుకుని.. అవసరం తీరాక వదిలేసే వాళ్లను ఒడ్డుకు చేరాక బోడి మల్లయ్య అనే సామెత పుట్టుకొచ్చింది.