వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లి సమీపంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పులి సంచారంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బసిరెడ్డిపల్లి సమీపంలోని క్రిష్ణగిరి ఆలయ పరిధిలోని గోశాలలో ఆవులపై దాడి చేసింది పెద్దపులి. ఈ ఘటనలో పలు ఆవులు, దూడలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన గోసంరక్షకుడు కేకలు వేస్తూ పరుగులు తీస్తూ అక్కడి నుంచి పారిపోయినట్లు చెబుతున్నారు.
పెద్దపులి దాడిలో ఆవులకు మెడ, ఉదర భాగంలో తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఆవు వీపుపై పెద్దపులి పంజా గుర్తులు ఉన్న ఆవు మృతి చెందింది. పులి కదలికలు పక్కనే ఉన్న ఫామ్ హౌస్ సీసీటీవీలో రికార్డయ్యాయి. పులి శరీరంపై పొడవైన చారలు ఉన్నాయని.. అది పెద్దపులే అంటున్నారు గోసంరక్షకులు.
గోశాలలో 200 దాకా ఆవులు ఉన్నాయని..అటవీశాఖ అధికారులు స్పందించి వెంటనే పులిని బంధించి అటవీ ప్రాంతంలో వదిలేయాలని కోరుతున్నారు గోశాల నిర్వాహకులు.
