ఎన్నికల సంఘం వివాదం, సీఈసీ జ్ణానేష్ కుమార్ రాజీనామాకు ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న క్రమంలో ఆయన కుమార్తె, ఐఏఎస్ మేధా రూపమ్ కొత్త వివాదంతో చిక్కుల్లో పడ్డారు. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వుకు వ్యతిరేకంగా మేధా రూపమ్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను లిస్ట్ చేసిన విధానంపై లాయర్ల సంఘం అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ కు లేఖ రాసింది.
ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని, కార్యకర్త అయిన ఆకృతి చౌదరి కేసులో అలహాబాద్ హైకోర్టు తీర్పును మేధా రూపమ్,యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ జస్టిస్ ఎన్.కె. సింగ్ లతో కూడిన ధర్మాసనం కేసు విచారణ చేపట్టింది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల అమలు, నష్టపరిహారాన్ని నిలిపివేసింది. అయితే కోర్టు నిబంధనలకు విరుద్దంగా మేధా రూపమ్ పిటిషన్ ను ధర్మాసనం విచారించిందని రాజ్యాంగ న్యాయవాదుల సంఘం (LAFC) ఆరోపించింది.
ఆకృతి చౌదరీ కేసు..
నోయిడాలో వేతనాలు పెంపును కోరుతూ జరిగిన కార్మికుల నిరసనలో పాల్గొన్నందుకు ఆకృతి చౌదరిని ఏప్రిల్లో అరెస్టు చేశారు. నోయిడా జిల్లా మేజిస్ట్రేట్ మేధా రూపమ్, కఠినమైన ఎన్ఎస్ఏ కింద చౌదరిని నిర్బంధించాలనే ఉత్తర్వుపై సంతకం చేశారు. దీంతో ఆకృతి చౌదరి దాదాపు ఐదు నెలల పాటు కస్టడీలో ఉన్నారు.
ఇదిలా ఉంటే.. ఆకృతి చౌదరి అరెస్టు,నిర్భంధం ఆమె జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు హరించడమే అని సెప్టెంబర్ 2న ఆమె కస్టడీని చట్టవిరుద్ధం అని రద్దు చేసింది. ఈ కేసుతో సంబంధమున్న డిఎం మేధా రూపమ్ తో సహా, అధికారులపై మండిపడింది. వారి జీతాల నుంచి రూ.5 లక్షల పరిహారాన్ని ఆకృతి చౌదరికి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
Live Lawప్రకారం.. జూలై 13 నాటి అధికారిక లిస్టు ప్రకారం నోయిడాలోని కార్మిక ఆందోళనకు సంబంధించిన కేసులు జస్టిస్ బి.వి. నాగారత్న నేతృత్వంలోని ధర్మాసనం ముందు పెండింగ్ లో ఉన్నాయి. సీఈసీ జ్ఞానేష్ కుమార్ కుమార్తె కావడంతో రూపమ్ కు ఈ కేసులో ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని లాయర్ల సంఘం ఆరోపించింది. సీనియర్ సివిల్ సర్వెంట్ల కుటుంబాల కేసులకు ఇలా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం తప్పుడు చర్య అని వాదిస్తున్నారు.
