కొండగట్టు: సినీ నటుడు వరుణ్ తేజ్ కొండగట్టు అంజన్నను దర్శించుకుని దీక్ష తీసుకున్నారు. అంజన్నకు ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మెగా కుటుంబం కొండగట్టుకు పలుమార్లు వెళ్లి దర్శనం చేసుకున్న సంగతి తెలిసిందే. కొండగట్టుకు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు ఉన్న అనుబంధం ఏంటో తెలిసిందే.
పవన్ కల్యాణ్ ఏం సంకల్పించినా కొండగట్టు అంజన్నను దర్శించుకున్నాకనే ముందుకెళుతుంటారు. ఇదిలా ఉండగా.. వరుణ్ తేజ్తో పాటు కొరియన్ కనక రాజు సినిమా దర్శకుడు మేర్లపాక గాంధీ, హాస్య నటుడు సత్య కూడా అంజన్నను దర్శించుకుని దీక్ష పుచ్చుకోవడం గమనార్హం.
ఇదిలా ఉండగా.. ఎంటర్‌టైనింగ్ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న మేర్లపాక గాంధీ రూపొందించిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’. వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 7న విడుదలైంది. థియేటర్లలో నవ్వులు పూయించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుని పర్వాలేదనిపించింది. నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 4, 2026 నుంచి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అయింది. ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ లభించింది.
