హైదరాబాద్ లో ట్రంప్ టవర్స్.... రెండు టవర్లు.. 65 అంతస్తులు.. సౌత్ ఇండియాలో అతి పెద్ద బిల్డింగ్స్

హైదరాబాద్ లో ట్రంప్ టవర్స్.... రెండు టవర్లు.. 65 అంతస్తులు.. సౌత్ ఇండియాలో అతి పెద్ద బిల్డింగ్స్
  • రూ. 2 వేల కోట్లతో నిర్మాణాలు.. 2031 లోగా పూర్తి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లో ‘ట్రంప్​ టవర్స్’ పేరిట సౌత్​ ఇండియాలోనే అతి ఎత్తయిన రెసిడెన్షియల్​  బిల్డింగ్స్  నిర్మించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు చెందిన ట్రంప్​ ఆర్గనైజేషన్, ట్రిబేకా డెవలపర్స్, ఐరా రియాల్టీ  సంస్థలు కలిసి రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట్ గోల్డెన్ మైల్ రోడ్‌‌ లోని సర్వే నంబర్ 109లో ఈ టవర్స్​ నిర్మించనున్నాయి. 

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ, ఓఆర్​ఆర్​కి దగ్గరగా  మొత్తం 4 ఎకరాల్లో 65 అంతస్తులతో 242 మీటర్ల ఎత్తుతో టవర్స్ రానున్నాయి. ఈ ప్రాజెక్ట్​కు ఇప్పటికే తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రేరా) అనుమతి ఇచ్చింది. త్వరలో జరిగే భూమి పూజకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. 

ఈ టవర్లలో అతి ఖరీదైన  450కి పైగా 3, 4 బీహెచ్​కే ఫ్లాట్లు ఉంటాయి. డబుల్-హైట్ సింప్లెక్స్ రెసిడెన్సెస్, 16 పెంట్‌హౌస్‌లు నిర్మిస్తున్నారు. ప్రతి యూనిట్‌కు ప్రైవేట్ లిఫ్ట్ లాబీ ఉంటుంది. మొత్తం22 లక్షల స్క్వేర్ ఫీట్ లతో  టవర్స్ నిర్మాణం జరుగుతుంది. 28వ ఫ్లోర్‌పై రెండు టవర్లను కలిపే స్పెండెడ్ స్కై బ్రిడ్జ్ ఈ బిల్డింగుకు అతిపెద్ద ఆకర్షణ. 

భారీ ధరలు..

ఈ అపార్ట్‌మెంట్లు ఒక్కో ఫ్లాట్​ రేటు సుమారు రూ.5 కోట్ల నుంచి రూ.18 కోట్ల వరకు ఉంటుంది. పెంట్‌హౌస్‌లకు రూ.30 కోట్ల నుంచి 62 కోట్ల వరకు ధరలు నిర్ణయించారు. ఇప్పటికే 8 పెంట్ హౌస్ లు అమ్ముడుకాగా.. అందులో ఒకదానికి రూ.62 కోట్లు పలికింది. పెంట్‌హౌస్‌ల విక్రయాల ద్వారానే రూ.250 కోట్లు వస్తాయని అంచనా వేశారు. మొత్తం టవర్స్ నిర్మాణానికి ల్యాండ్ తో కలిపి సుమారు రూ. రూ.2 వేల కోట్లు ఖర్చు చేయనుండగా.. అన్ని కలిపి రూ.4,200 కోట్ల ఆదాయం వస్తుందని చెప్తున్నారు. 

మే 15, 2031 లోగా కంప్లీట్ చేసి కొనుగోలుదారులకు అప్పగించాలని రేరా ఉత్తర్వులు జారీ చేసింది.  మూడేండ్లలో నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ట్రిబెకా డెవలపర్స్, ఐరా రియాల్టీ సంస్థలు తెలిపాయి. దేశంలో ట్రంప్ టవర్స్ పేరుతో ఇప్పటికే 8 ప్రాజెక్టులు ప్రకటించిన ట్రిబేకా డెవలపర్స్..​ దక్షిణ భారతంలో తొలిసారిగా ట్రంప్​ ​పేరిట  హైదరాబాద్​లో ఈ టవర్స్​ నిర్మించబోతోంది. హైదరాబాద్ లో ఒక ప్రాజెక్ట్ చేపట్టాలని అనుకుంటున్నామని, అది ఇప్పుడు సాధ్యమయ్యిందని  ట్రిబెకా డెవలపర్ ఫౌండర్​ కల్పేశ్ మెహతా తెలిపారు.