ఆన్ లైన్ లో ఇక్కడి నుంచి వచ్చే ఐటమ్స్ విషం : బ్లింకిట్ స్టోర్ లైసెన్స్ రద్దు.. జెప్టో వేర్ హౌస్ సీజ్..

 ఆన్ లైన్ లో ఇక్కడి నుంచి వచ్చే ఐటమ్స్ విషం : బ్లింకిట్ స్టోర్ లైసెన్స్ రద్దు.. జెప్టో వేర్ హౌస్ సీజ్..

మొబైల్ ఉంది.. డేటా ఉంది.. మస్తుగా డబ్బులు ఉన్నాయి.. అన్నిటికీ మించి మన దగ్గర బద్దకం ఉంది. ఇంకేం చేస్తాం.. ఎంచక్కా ఆన్ లైన్ లో ఆర్డర్స్ పెట్టేస్తాం.. పులిహోర నుంచి ఇడ్లీ వరకు.. బాత్ రూంలో సబ్బు నుంచి వంట గదిలోని బియ్యం, పప్పు, ఉప్పుల వరకు అన్నీ ఆన్ లైన్ లోనే.. ఆన్ లైన్ లో ఇంటికి వస్తున్న సరుకులను ఎలా నిల్వ చేస్తున్నారు.. ప్యాకింగ్ లోపల సరుకు బాగుందా లేదా అని ఎవరూ చెక్ చేయటం లేదు. ముంబై ఫుడ్ సేఫ్టీ అధికారులు.. ఆన్ లైన్ డెలివరీ వస్తువులు సరఫరా చేసే వేర్ హౌస్.. గోదాంలను తనిఖీ చేసినప్పుడు దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి. షాక్ అయిన అధికారులు బ్లింకిట్ స్టోర్ లైసెన్స్ రద్దు చేయగా.. జెప్టో వేర్ హౌస్ గోదాంను సీజ్ చేశారు. పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందామా...

ఆహార భద్రతా నిబంధనలు పాటించకపోవడంతో  ముంబైలోని బ్లింకిట్ స్టోర్ లైసెన్స్‌ను సస్పెండ్ చేయగా, బెంగళూరులోని జెప్టో వేర్ హౌస్ ని అధికారులు సీల్ చేశారు.

 ముంబై మలాడ్ వెస్ట్‌లోని బ్లింకిట్ స్టోర్‌లో మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అధికారులు ఆగస్టు 7న తనిఖీలు చేపట్టారు. అక్కడ పురుగులు పట్టడం, తీవ్రమైన అపరిశుభ్ర వాతావరణం ఉండటాన్ని గుర్తించి, ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం స్టోర్ ఫుడ్ లైసెన్స్‌ను రద్దు చేసారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు అక్కడ ఎలాంటి ఆహార వ్యాపారం జరపకూడదని స్పష్టం చేశారు.

మహారాష్ట్రలో విస్తృత తనిఖీలు:
మే 25 నుంచి జూలై 31 వరకు ముంబైలో దాదాపు 3,137 ఆహార కేంద్రాలను FDA తనిఖీ చేసింది. అందులో 764 సంస్థలకు నోటీసులు ఇవ్వగా, 165 కేంద్రాల లైసెన్సులను సస్పెండ్ చేశారు. అయితే లోపాలను సరిదిద్దుకుంటే మళ్లీ తనిఖీలు చేసి లైసెన్సులను పునరుద్ధరిస్తామని FDA కమిషనర్ తుకారాం ముండే తెలిపారు.

బెంగళూరులో జెప్టో, ఇందిరా క్యాంటీన్లపై డ్రైవ్:
కర్ణాటక ఆహార భద్రతా విభాగం బెంగళూరులో చేసిన తనిఖీల్లో పరిశుభ్రత లోపాలు, తప్పుడు లేబులింగ్ గుర్తించి ఒక జెప్టో గిడ్డంగిని సీల్ చేసింది. అలాగే నగరంలోని మూడు 'ఇందిరా క్యాంటీన్ల'ను కూడా అధికారులు పరిశీలించారు. అక్కడ పరిశుభ్రత సరిగా లేకపోవడంతో ఒక క్యాంటీన్‌కు చెందిన గిడ్డంగిని మూసివేశారు.