Jammu And Kashmir: అక్టోబర్ 1 నుంచి 5వ తేదీ వరకు శ్రీనగర్‌లోని ప్రతిష్టాత్మక షేర్-ఎ-కాశ్మీర్ స్టేడియంలో ఇరానీ కప్ 2026 పోరు జరగనుంది. 2025–26 రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన జమ్మూ & కాశ్మీర్ జట్టు, రెస్ట్ ఆఫ్ ఇండియా (ROI) టీమ్‌తో ఈ మ్యాచ్‌లో తలపడనుంది. 1986 సెప్టెంబర్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే మ్యాచ్ తర్వాత, దాదాపు 40 ఏళ్లకు కాశ్మీర్ లోయలో జరుగుతున్న అత్యంత కీలకమైన క్రికెట్ టోర్నమెంట్ ఇదే కావడం విశేషం.
రంజీ టైటిల్‌తో దక్కిన ఆతిథ్య హక్కులు:
హుబ్లీ వేదికగా జరిగిన 2025–26 రంజీ ట్రోఫీ ఫైనల్లో కర్ణాటకపై తొలి ఇన్నింగ్స్ భారీ ఆధిక్యంతో అద్భుత విజయం సాధించి జమ్మూ కాశ్మీర్ తమ మొదటి రంజీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆ చారిత్రాత్మక విజయంతోనే ఈసారి ఇరానీ కప్‌లో ఆడే అర్హత సాధించడమే కాకుండా, కాశ్మీర్ గడ్డపై ఆతిథ్యం ఇచ్చే అరుదైన అవకాశాన్ని కూడా సొంతం చేసుకుంది.
స్టార్ పేసర్ ఆకిబ్ నబీపైనే అందరి దృష్టి:
ఈ మ్యాచ్‌లో జమ్మూ కాశ్మీర్ బౌలింగ్ విభాగాన్ని బారాముల్లాకు చెందిన 29 ఏళ్ల స్టార్ పేసర్ ఆకిబ్ నబీ దార్ ముందుండి నడిపించనున్నాడు. గత రంజీ సీజన్‌లో ఏకంగా 60 వికెట్లు తీసి జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన ఆకిబ్, కర్ణాటకతో జరిగిన ఫైనల్లో 5/54 తో చెలరేగాడు. ఇటీవల భారత టెస్టు జట్టులోకి కూడా ఎంపికైన ఆయన, రాజస్థాన్ రాయల్స్ స్టార్ యుధ్‌వీర్ సింగ్ చరక్‌తో కలిసి ప్రత్యర్థి బ్యాటర్లకు సవాలు విసరనున్నాడు.
రెస్ట్ ఆఫ్ ఇండియా సవాల్:
ఇరానీ కప్‌లో అత్యధికంగా 30 సార్లు విజేతగా నిలిచిన అద్భుత రికార్డు రెస్ట్ ఆఫ్ ఇండియా సొంతం. బీసీసీఐ త్వరలోనే ఈ జట్టును ప్రకటించనుండగా, ఏ ఆటగాళ్లతో వచ్చినా జేఅండ్‌కేకి గట్టి పోటీ తప్పదు. ఇక ఇరానీ కప్ ముగిసిన వెంటనే అక్టోబర్ 11వ తేదీ నుంచి జమ్మూ కాశ్మీర్ తమ రంజీ ట్రోఫీ 2026–27 టైటిల్ డిఫెన్స్‌ను మధ్యప్రదేశ్‌తో మ్యాచ్ ద్వారా ప్రారంభించనుంది.
