Telangana Cricket: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రికెట్ ప్రతిభను వెలికితీసేందుకు, ప్రతి జిల్లాలో హెచ్‌సీఏ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా క్రికెట్ మౌలిక వసతుల అభివృద్ధి కమిటీ చైర్మన్ టి. శేషనారాయణ వెల్లడించారు. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.
జిల్లాల్లోనే దరఖాస్తులు.. సమస్యలకు అక్కడే పరిష్కారం:
ఇన్నాళ్లూ హైదరాబాద్‌కే పరిమితమైన క్రికెట్ అవకాశాలను గ్రామీణ స్థాయికి విస్తరించడమే ప్రధాన లక్ష్యంగా హెచ్‌సీఏ అడుగులు వేస్తోంది. రాబోయే 2,3 నెలల్లోనే జిల్లాల్లో హెచ్‌సీఏ కార్యాలయాలను ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. స్థానిక క్రికెటర్ల సమస్యలు తెలుసుకోవడంతో పాటు సెలక్షన్స్ (Selections), టోర్నమెంట్లకు సంబంధించిన దరఖాస్తులను కూడా ఈ జిల్లా ఆఫీసుల్లోనే స్వీకరిస్తారని తేల్చి చెప్పారు.
స్కూళ్లు, కళాశాలల్లో క్రికెట్ మైదానాలు:
గ్రామీణ ప్రాంతాల్లో సరైన మౌలిక వసతులు లేక ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు వెనుకబడిపోతున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేకంగా క్రికెట్ మైదానాలను, నెట్స్, ప్రాక్టీస్ వసతులను కల్పించనున్నట్లు జిల్లా క్రికెట్ మౌలిక వసతుల అభివృద్ధి కమిటీ చైర్మన్ టి. శేషనారాయణ తెలిపారు. జిల్లాల నుంచి వచ్చే క్రికెటర్ల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. హెచ్‌సీఏ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్‌గా వ్యవహరిస్తున్న భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు స్వయంగా జిల్లా స్థాయి సెలెక్షన్ల ప్రక్రియను పరిశీలిస్తారని స్పష్టం చేశారు.
