భారత్‌లో ద్రవ్యోల్బణం మెల్లగా మళ్లీ అదుపు తప్పుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. జూలై 2026లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.45 శాతానికి చేరింది. జూన్‌లో ఇది 4.38 శాతంగా ఉండగా.. నెల రోజుల్లోనే స్వల్పంగా పెరిగింది. ముఖ్యంగా ఆహార ధరలు పెరగడం ఈసారి ద్రవ్యోల్బణాన్ని పెంచింది. దీంతో కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్(CPI) రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన 4 శాతం మధ్యకాలిక లక్ష్యానికి పైనే కొనసాగుతోంది. మార్కెట్ అంచనా 4.50 శాతం కాగా.. ప్రభుత్వ గణాంకాలు దానికి దాదాపు దగ్గరగానే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 4.84 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 3.96 శాతానికి పెరగడం కూడా ధరల ఒత్తిడి అన్ని వర్గాలపై సమానంగా లేదని చూపిస్తోంది.
ఈసారి అసలు టెన్షన్ ఆహార ధరల దగ్గరే కనిపిస్తోంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ జూన్‌లో 5.32 శాతం ఉండగా, జూలైలో 5.52 శాతానికి పెరిగింది. ముఖ్యంగా ఉల్లి, వెల్లుల్లి, అల్లం ధరలు భారీగా పెరగడం వంటింటి బడ్జెట్‌పై ప్రభావం చూపుతోంది. ఉల్లి ద్రవ్యోల్బణం ఏకంగా 22.54 శాతానికి చేరగా, వెల్లుల్లి ధరల పెరుగుదల 35.36 శాతంగా, అల్లం 83.62 శాతంగా నమోదైంది. అయితే అన్ని కూరగాయల ధరలు పెరగలేదు. బంగాళాదుంప, బెండకాయ, బఠానీలు, టమాటాల్లో ధరల తగ్గుదల నమోదైంది. అంటే మార్కెట్‌లో ఆహార ధరల పరిస్థితి ఒకేలా కాకుండా, వస్తువును బట్టి మారుతోంది.
కేటగిరీల వారీగా ద్రవ్యోల్బణం
- రిటైల్ CPI: జూలైలో 4.45% — జూన్‌లో 4.38%.
- ఫుడ్ ఇన్ఫ్లేషన్ (CFPI): జూలైలో 5.52% — జూన్‌లో 5.32%.
- గ్రామీణ ద్రవ్యోల్బణం: జూలైలో 4.84% — జూన్‌లో 4.74%.
- పట్టణ ద్రవ్యోల్బణం: జూలైలో 3.96% — జూన్‌లో 3.93%.
- ఆహారం, పానీయాలు: జూలైలో 5.24% — జూన్‌లో 5.05%.
- ఉల్లి: జూలైలో 22.54% — జూన్‌లో 4.73%.
- వెల్లుల్లి: జూలైలో 35.36% — జూన్‌లో 17.93%.
- అల్లం: జూలైలో 83.62% — జూన్‌లో 50.41%.
- బంగాళాదుంప: -జూలైలో 16.56% — ధరల్లో తగ్గుదల.
- రవాణా: జూలైలో 4.43% — జూన్‌లో 4.31%.
- హోటల్స్, రెస్టారెంట్లు: జూలైలో 7.72%.
- దుస్తులు, పాదరక్షలు: జూలైలో 3.38%.
- హెల్త్: జూలైలో 1.34%.
- ఎడ్యుకేషన్ సర్వీసెస్: జూలైలో 3.64%.
- పర్సనల్ కేర్, ఇతర సేవలు: జూలైలో 14.77%.
ట్రాన్స్ పోర్ట్, రెస్టారెంట్లు, పర్సనల్ కేర్ వంటి సేవల ధరలు కూడా వినియోగదారులకు అదనపు భారాన్ని పెంచుతున్నాయి. రవాణా ద్రవ్యోల్బణం 4.43 శాతానికి చేరగా, రెస్టారెంట్, వసతి సేవల్లో ఇది 7.72 శాతంగా ఉంది. పర్సనల్ కేర్, సోషల్ సేఫ్టీ, ఇతర వస్తువులు-సేవల విభాగంలో ద్రవ్యోల్బణం ఏకంగా 14.77 శాతంగా నమోదైంది. ముఖ్యంగా ఇతర వ్యక్తిగత వస్తువుల ధరలు 43.54 శాతం పెరగడం దీనిపై ప్రభావం చూపింది. అంటే కేవలం కూరగాయలు, నిత్యావసర వస్తువులే కాదు.. బయట తినడం, తిరగటం, వ్యక్తిగత అవసరాలు వంటి ఖర్చులు కూడా ప్రజల బడ్జెట్‌ను ఒత్తిడికి గురిచేస్తున్నాయి.
ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పటికీ.. RBIకి ఒక ఊరట మాత్రం ఉంది. ఆగస్టు 5న జరిగిన ద్రవ్య విధాన సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ అంచనాను 5.1 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉండటం, సరఫరా ఒత్తిళ్లు కొంత తగ్గడం ఇందుకు కారణాలుగా పేర్కొంది. అయితే ప్రస్తుత గణాంకాలు ఆహార ధరల విషయంలో అప్రమత్తత అవసరమని సూచిస్తున్నాయి. ముఖ్యంగా పండుగలు, వాతావరణ పరిస్థితులు, సరఫరా అంతరాయాలు ధరలను మరింత ప్రభావితం చేస్తే ద్రవ్యోల్బణం ఇంకాస్త పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపు తప్పకపోయినా.. సామాన్యుడి వంటింటి ఖర్చులు, నెలవారీ బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుంటే ‘మెల్లగా అదుపుతప్పుతున్న ద్రవ్యోల్బణం’పై నిఘా తప్పనిసరిగా మారింది.
