న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ టూ-వీలర్ల కోసం పీఎం ఈ–డ్రైవ్ పథకం గడువును ప్రభుత్వం 2028 మార్చి వరకు పొడిగించింది. ఈ సెగ్మెంట్‌కు సంబంధించిన ఇన్సెంటివ్‌లను కిలోవాట్ అవర్‌కు రూ.5,000 నుంచి రూ.2,500 కు తగ్గించారు. హెవీ ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ టూ-వీలర్లు కిలోవాట్ అవర్‌కు రూ.2,500 ఇన్సెంటివ్ పొందవచ్చు. ప్రతి వాహనానికి గరిష్టంగా రూ.5,000 వరకు పరిమితి వర్తిస్తుంది. 2025 ఏప్రిల్ నుంచి 2028 మార్చి మధ్య కాలానికి ఈ నిబంధన వర్తిస్తుంది.
గత ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్లకు కిలోవాట్ అవర్‌కు రూ.5,000 ఇన్సెంటివ్ లభించింది. వాహనానికి గరిష్టంగా రూ.10 వేల వరకు పరిమితి ఉండేది. ఈ ఇన్సెంటివ్ పొందడానికి ఎలక్ట్రిక్ టూ-వీలర్ గరిష్ట ఎక్స్-ఫ్యాక్టరీ ధర రూ.1.5 లక్షలుగా నిర్ణయించారు. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నుంచి రూ.2,767 కోట్ల ఫండ్ సపోర్ట్ లభిస్తుంది. పీఎం ఈ–-డ్రైవ్ పథకం మొత్తం రూ.11,900 కోట్ల బడ్జెట్‌తో అమలవుతోంది.
