- లోక్‌సభలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి సమాధానం
న్యూఢిల్లీ, వెలుగు: వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (వీబీజీ రామ్ జీ) కింద పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో 4.06 లక్షల గ్రామీణ కుటుంబాలు వేతన ఉపాధి కోసం నమోదయ్యాయని కేంద్రం తెలిపింది. మంగళవారం లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
2025-26లో పెద్దపల్లి పరిధిలో 44,132 ఎస్సీ, 14,313 ఎస్టీ కుటుంబాలు సహా మొత్తం 1,69,215 కుటుంబాలకు ఉపాధి కల్పించినట్లు తెలిపారు. ఇందులో 1,55,374 మంది మహిళలు ఉన్నారని చెప్పారు. 2025–-26 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న ఉపాధి బకాయిలన్నీ చెల్లించినట్లు స్పష్టం చేశారు.
పీఎంఎంఎస్‌వై కింద 4.35 లక్షల మందికి లబ్ధి..
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) కింద తెలంగాణలో 4,35,123 మంది లబ్ధి పొందారని కేంద్రం తెలిపింది. 2020-21 నుంచి 2025-26 వరకు రాష్ట్రంలో రూ.353.02 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చినట్లు ఎంపీ గోడం నగేశ్ప్రశ్నకు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇందులో కేంద్ర వాటా రూ.112.69 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.41.19 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు.
వరంగల్ పీఎం మిత్రా పార్క్‌కు రూ.300 కోట్లు..
వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్న పీఎం మిత్రా టెక్స్‌టైల్ పార్క్‌లో మౌలిక వసతుల కోసం రూ.300 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్రం తెలిపింది. ఈ ప్రాజెక్టుతో లక్ష ప్రత్యక్ష, రెండు లక్షల పరోక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుత పెట్టుబడులతోనే 24,400 మందికి ఉపాధి దక్కుతుందని ఎంపీ రఘునందర్ రావు ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాకు రూ.536 కోట్లు..
హైదరాబాద్-నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగమైన జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాకు కేంద్రం రూ.536.22 కోట్ల ఈక్విటీ నిధులు విడుదల చేసినట్లు తెలిపింది. రూ.2,361 కోట్లతో 3,245 ఎకరాల్లో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశామని ఎంపీ రామసహాయం రఘురామ్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దీనివల్ల రూ.10 వేల కోట్ల పెట్టుబడులు, 1.74 లక్షల మందికి ఉపాధి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.
