తన ఆస్తులపై కేటీఆర్ సమాధానం చెప్పాలి..వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం

తన ఆస్తులపై కేటీఆర్ సమాధానం చెప్పాలి..వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం
  •     ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

సిరిసిల్ల టౌన్, వెలుగు: సిరిసిల్లలో సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి బహిరంగ సభ విజయవంతం కావడంతో బీఆర్‌‌‌‌ఎస్ నాయకులకు వణుకు పుట్టిందని,  వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్​ జెండా ఎగరడం ఖాయమని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ ఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం సభకు లక్ష మందికిపైగా ప్రజలు తరలివచ్చారని, సభ విజయవంతం చేసిన జిల్లా ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. సభ సక్సెస్ కావడంతో బీఆర్‌‌‌‌ఎస్ నాయకులు అసత్య ప్రచారానికి దిగుతున్నారని ఆరోపించారు. 

కేటీఆర్ ఆస్తుల పెరుగుదలపై ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2009 నుంచి 2026 వరకు కేటీఆర్ ఆస్తులు 1,400 శాతం, హరీశ్‌‌‌‌రావు ఆస్తులు 3,400 శాతం పెరిగాయని పేర్కొంటూ.. ఈ వివరాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్నారు. సిరిసిల్లలో నేతన్నలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, మరోవైపు తన వ్యక్తిగత వ్యాపారాలు విస్తరించడంపై సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేటీఆర్​ఇక్కడి ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. 

బీఆర్‌‌‌‌ఎస్ ఖాతాలో ఉన్నట్లు చెబుతున్న రూ.1,400 కోట్ల నిధులపైనా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు చెందాల్సిన భూములు, వనరుల విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూపరెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు దేవరాజు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.