ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.సింగీతం శ్రీనివాసరావు తమ కుటుంబానికి ఎంతో సన్నిహితులని బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు.
తన కెరీర్‌లో సింగీతం శ్రీనివాసరావుతో కలిసి మూడు అద్భుతమైన చిత్రాలు చేశానని తెలిపారు.‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’, ‘శ్రీ కృష్ణార్జున విజయం’ వంటి క్లాసిక్ చిత్రాలు అందించామని చెప్పారు.
ఒకే దర్శకుడి సారథ్యంలో సాంఘికం, చారిత్రకం, జానపదం, పౌరాణికం.. ఇలా నాలుగు ప్రధాన జానర్‌లలో పాత్రలు పోషించే అవకాశం తనకు దక్కిందని బాలకృష్ణ పేర్కొన్నారు.తన తండ్రి, దివంగత నందమూరి తారక రామారావు తొలిసారిగా శ్రీకృష్ణుడి పాత్రలో నటించిన ‘మాయాబజార్’ చిత్రానికి సింగీతం శ్రీనివాసరావు, దర్శకుడు కె.వి.రెడ్డి వద్ద సహాయకుడిగా పనిచేశారని బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు.
ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన ఎన్నో చిత్రాలకు సింగీతం గారు అసోసియేట్‌గా పనిచేశారని.. అందుకే ఆయనతో తమ కుటుంబానికి సినిమా రంగానికి అతీతమైన ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని తెలిపారు.
సింగీతం శ్రీనివాసరావు అసలు సిసలైన దిగ్గజ దర్శకుడని బాలకృష్ణ కొనియాడారు.94 ఏళ్ల వయసులోనూ చివరి శ్వాస వరకు భారతీయ సినిమాల్లో ఎన్నో ప్రయోగాలు చేసిన మహానుభావుడని అన్నారు.
సింగీతం శ్రీనివాసరావు మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని.. భారతీయ చిత్ర పరిశ్రమకు పూడ్చలేని నష్టమని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. సింగీతం శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు నందమూరి కుటుంబం తరఫున బాలకృష్ణ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
