‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లే’ పాటలోని సన్నివేశాలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఘటనపై జాన్వీ కపూర్ స్పందించింది. స్త్రీలను కేవలం ఒక వస్తువుగా చూపేలా సాంకేతికతను దుర్వినియోగం చేయడం, వారి అనుమతి లేకుండా కల్పిత కంటెంట్‌ను ప్రచారం చేయడం తీవ్రమైన ఉల్లంఘన అని ఆమె చెప్పింది.
ఇది దాదాపు లైంగిక దాడితో సమానం అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సినీ రంగంలోని దాదాపు ప్రతి మహిళా దీనిని ఏదో ఒక రూపంలో ఎదుర్కొన్నారని, ప్రపంచవ్యాప్తంగా మహిళలే ఎక్కువగా ఇలాంటి ఘటనల్లో బాధితులుగా మారుతున్నారని ఆమె వివరించింది.
స్త్రీ శరీరం పట్ల సమ్మతి, స్వేచ్ఛ, గౌరవం అనేవి మానవత్వానికి సంబంధించిన అత్యంత ప్రాథమిక అంశాలుగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. అయినప్పటికీ, ఏదో కారణంతో వీటిని ఇప్పటికీ సంక్లిష్టమైన విషయాలుగా పరిగణిస్తున్నారని ఆమె తన ఇన్ స్టా స్టోరీలో ప్రస్తావించారు. వాస్తవానికి అవి సంక్లిష్టమైనవి కావని, ఒక మహిళ వరుసగా ఐదు రోజులు 'అవును' అని చెప్పి, ఆరవ రోజు 'కాదు' అని చెబితే, ఆ 'కాదు' అనే మాటకు కచ్చితంగా గౌరవం ఇవ్వాలనే విషయాన్ని అర్థం చేసుకోవడం కొందరికి ఇంకా కష్టంగా అనిపించడం ఆశ్చర్యకరమని ఆమె విస్తుపోయింది.
ఆమె మినీ స్కర్ట్ ధరించినంత మాత్రాన, ఆమె స్కర్ట్ కింద కెమెరా పెట్టడానికి, ఆమెను అవమానకరమైన కోణాల్లో చిత్రీకరించడానికి లేదా ఆమె శరీరాన్ని దృశ్యపరంగా దుర్వినియోగం చేయడానికి ఎవరికీ అనుమతి లభించదని జాన్వీ కపూర్ కుండబద్ధలు కొట్టింది. ఆమె దేనితో సౌకర్యవంతంగా ఉందని, ఎక్కడ హద్దులు గీసుకుందో, తన శరీరం విషయంలో ఏమి చేయాలనుకుంటోందని అనేవి పూర్తిగా ఆమె తీసుకునే నిర్ణయాలని జాన్వీ కపూర్ స్పష్టం చేసింది.
►ALSO READ | Singeetham Srinivasa Rao: ‘సింగీతా’నికి ఇక సెలవు.. ముగిసిన లెజెండరీ దర్శకుడి అంత్యక్రియలు
మార్ఫింగ్ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసి, ఇలాంటి పనులను ఖండించినందుకు ఎన్టీఆర్కు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. లక్షలాది మంది అభిమానించే ఒక వ్యక్తి, తనకు వ్యక్తిగతంగా సంబంధం లేని విషయంపై కూడా స్పందించినప్పుడు.. ఏదో ఒక స్థాయిలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న ప్రతి మహిళకూ అది ఎంతో భరోసానిస్తుందని ఎన్టీఆర్ స్పందించడంపై జాన్వీ హర్షం వ్యక్తం చేసింది.
ఇలాంటి దుశ్చర్యలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చిన చిరంజీవి, విజయ్, ఖుష్బూకు కూడా జాన్వీ ధన్యవాదాలు తెలిపింది. ఒక మహిళను కేవలం మనిషిగా చూడాలని, మనిషిగానే గౌరవించాలని కోరుకోవడంలో తప్పేముందని ఆమె ప్రశ్నించింది. ‘‘ఆమె శరీరం. ఆమె వ్యక్తిత్వం. ఆమె హద్దులు. ఆమె నిర్ణయం’’ అని జాన్వీ కపూర్ ఈ అంశంపై స్పందించింది.
