అమిత్ షా పర్యటనను అడ్డుకుంటాం..ప్రతిమ మెడికల్ కాలేజీ అదనంగా వసూలు చేసిన సొమ్ము వాసన్ ఇవ్వాలి

అమిత్ షా పర్యటనను అడ్డుకుంటాం..ప్రతిమ మెడికల్ కాలేజీ అదనంగా వసూలు చేసిన సొమ్ము వాసన్ ఇవ్వాలి
  •    ప్రతిమ మెడికల్ కాలేజీ అదనంగా వసూలు చేసిన రూ.15.60 కోట్లు రీఫండ్ చేయాలి
  •     మెడికో పేరెంట్స్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లోజుల సత్యనారాయణ

 హైదరాబాద్, వెలుగు : ప్రతిమ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజీ విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన ఫీజును తిరిగి చెల్లించాలని మెడికో పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లోజుల సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మొత్తాన్ని రీఫండ్ చేయకపోతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాలేజీ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. 

శుక్రవారం కరీంనగర్‌‌‌‌ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2021 ఎంబీబీఎస్ బ్యాచ్‌‌‌‌ లో 200 మంది విద్యార్థులు ఉండగా, రూల్స్ ప్రకారం నాలుగున్నరేండ్ల ఫీజు మాత్రమే వసూలు చేయాల్సి ఉన్నప్పటికీ కాలేజీ యాజమాన్యం మాత్రం ఐదేండ్ల పూర్తి ఫీజును వసూలు చేసిందని ఆరోపించారు. 

70 మంది బి-–కేటగిరీ విద్యార్థుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.6 లక్షల చొప్పున రూ.4.20 కోట్లు, 30 మంది సి-–కేటగిరీ విద్యార్థుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.12 లక్షల చొప్పున రూ.3.60 కోట్లు వసూలు చేసిందన్నారు. 2021, 2022 సంవత్సరాలకు సంబంధించి మొత్తం రూ.15.60 కోట్లు అదనంగా వసూలు చేసినట్లు ఆరోపించారు. అదనపు ఫీజులు వసూలు చేయవద్దని, ఆ డబ్బులను తిరిగి చెల్లించాలని టీఏఎఫ్ఆర్సీ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కాలేజీ యాజమాన్యం స్పందించడం లేదని, కాళోజీ వర్సిటీ నిబంధనలను సైతం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.